Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో సీఎస్ న్యాయవాది వాదన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర సర్వీస్ ఉద్యోగులను (ఐఎఎస్, ఐపీఎస్) విభజన చేసేందుకు కేంద్రం నియమించిన ప్రత్యూష్‌సిన్హా కమిటీ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తరఫు సీనియర్ న్యాయవాది హైకోర్టులో వాదించారు. రాష్ట్ర విభజన ఏర్పాటు చేసే వరకు ఉమ్మడి ఏపీకి చివరి ప్రధాన కార్యదర్శిగా పీకే మహంతి విధుల్లో ఉన్నారనీ, ఆయన పేరిట జూన్ ఒకటో తేదీన కూడా జీవోలు వెలువడ్డాయనీ, అలాంటి వ్యక్తి కమిటీలో సభ్యుడిగా కొనసాగడం చెల్లదని వాదించారు. కమిటీలో ఉంటూ తన అల్లుడు, కూతురుకు ప్రయోజనం చేకూరేలా చేశారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సులను అమలు చేయడాన్ని సవాల్ చేసిన కేసుల్లో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. రిట్లపై మంగళవారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. తదుపరి విచారణను జూన్ ఏడోతేదీకి వాయిదా వేసింది.
టీఎస్పీడీసీఎల్కు హైకోర్టు నోటీసులు
మెట్రో రైళ్లకు విద్యుత్ చార్జీల పెంపునకు కారణాలు వివరించాలని టీఎస్పీడీసీఎల్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విద్యుత్ చార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎల్అండ్టీ (మెట్రో) రైలు లిమిటెడ్ వేసిన రిట్‌ను మంగళవారం జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి విచారించారు. మెట్రో రైలు విభాగాన్ని ప్రత్యేకంగా పరిగణించిందని పిటిషనర్ న్యాయవాది వాదించారు. 2003లో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా విద్యుత్ చార్జీలు పెంచారన్నారు.
2022-23 ఏడాది కేవీఏకు రూ.390 నుంచి రూ475కు పెంపుదల చేయడం వల్ల 2018 నుంచి నష్టాల్లో ఉన్న మెట్రోకు తీరని భారం అవుతుందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనను డిస్కంలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అప్పిలేట్ అథార్టీలు ఉండగా నేరుగా కోర్టుల్లో కేసు వేయడం చెల్లదని చెప్పాయి. టీఎస్పీడీసీఎల్కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.