Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధ్వంసకర శక్తులపై నిఘా
- అభివృద్ధిలో పాతబస్తీ.. కొత్త బస్తీకి తేడా లేదు
- బహదూర్‌పురా ఫ్లైఓవర్ శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ- సిటీబ్యూరో
'కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులాలు, మతాల పేరుతో చిచ్చుపెట్టి చిల్లర రాజకీయాలు చేయలేదు. నా చిన్నప్పుడు గ్రామర్ స్కూల్లో చదివినప్పుడు ఏదో ఒక పంచాయితీతో కర్ఫ్యూ విధించేవారు. ఇప్పుడు సీఎం నాయకత్వంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి. విధ్వంసకర శక్తులపై కన్నేసి ఉంచాలి. అలాంటి శక్తులను అణచివేస్తాం'అని పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. పాతబస్తీ.. కొత్త బస్తీకి తేడా లేకుండా సమానంగా అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని పాతబస్తీలో సుమారు రూ.580 కోట్లతో చేపట్టిన పలు అభివద్ధి పనులకు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సర్దార్‌మహల్ వద్ద ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. పాతబస్తీలో ఉన్న వారసత్వ సంపదను భవిష్యత్తు తరాలకు అందించడంలో భాగంగా ముందుగా మోజంజాహి మార్కెట్ పునరుద్ధరణ, పురాతన చారిత్రక కట్టడాల వారసత్వ సంపదను కాపాడేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్కు పూర్వ వైభవం తెచ్చేందుకు చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, ఇన్నోవేషన్ పనులను కేటాయించినట్టు తెలిపారు. వారసత్వ సంపద అయిన సర్దార్ మహల్‌ను కల్చరల్ హబ్‌గా తయారు చేస్తామన్నారు. పర్యాటకులు ఆకర్షించే విధంగా మ్యూజియం, 12 గదులు హోటల్ ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు 437 ఏండ్ల వారసత్వ సంపదను కాపాడుకుంటున్నామన్నారు. హైదరాబాద్ నగరం పాతబస్తీతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో నోటరీతో ఉన్న ప్రాపర్టీపై హక్కు కల్పిస్తామన్నారు. ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామన్నారు. జీఓ నెం. 58,59 ప్రకారంగా లక్ష మందికి అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధికి అసెంబ్లీలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ఆదేశించినట్టు చెప్పారు. హైదరాబాద్‌తో పాటుగా ఇతర జిల్లాల్లో కూడా ఆరోగ్య సేవలను అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. బహదూర్‌పుర ఫ్లైఓవర్‌కు ప్రముఖ వ్యక్తుల పేర్లు పెట్టాలని ఎంపీ అసదుద్దీన్ కోరిన నేపథ్యంలో తప్పకుండా చేస్తామని, దాంతో ప్రముఖ వ్యక్తుల సేవలు భావితరాల వారు స్మరించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. పాత నగరంతోపాటు కొత్త నగరంలో అవసరమైన చోట ఫ్లైఓవర్లను నిర్మాణం చేస్తామన్నారు. మిరాలంమండి పునర్నిర్మాణం, మహబూబ్‌చౌక్ వద్ద క్లాక్ టవర్ నిర్మాణం చేశామని, ముర్గిచౌక్ పునరుద్ధరణ పనులు, మీర్‌అలాం చెరువులో మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు అతిపెద్ద రెండో ఫ్లైఓవర్‌ను వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎంఎస్.ప్రభాకర్, రియాజుద్దీన్ హస్సన్, వాణిదేవి, ఎమ్మెల్యేలు ముంతాజ్ అహ్మద్‌ఖాన్, మహ్మద్ మోజాంఖాన్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
అది ఎన్డీయే కాదు.. ఎన్పీయే సర్కారు
- మన సిలిండర్ ధర ప్రపంచంలో ఎక్కడాలేదు : ట్విటర్లో కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వం కాదనీ, అది ఎన్పీయే (నాన్ ఫర్ఫార్మింగ్ అసెట్ -నిరర్ధక ఆస్థి) అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మోడీ హయాంలో దేశంలో దయనీయ పాలన సాగుతోందని విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. 'దేశంలో నిరుద్యోగం తారా స్థాయికి చేరింది, గత 45 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం తాండవిస్తోంది. ద్రవ్యోల్బణం 30 ఏండ్ల గరిష్టానికి చేరింది. ఇటీవల ఇంధన ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆయా ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. ప్రపంచంలో ఎక్కడా లేనం తగా ఎల్పీజీ సిలిండర్ ధర మన దగ్గర ఉంది.వినియోగదారుల విశ్వాసం అత్యల్ప స్థాయికి పడిపోయిందనే విషయాన్ని ఆర్బీఐ తన నివేదిక లో పేర్కొంది...' అని కేటీఆర్ వివరించారు.