Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కొన్నేండ్లుగా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ భోదన
- వచ్చే యేడాది వీరికి అవకాశం దక్కేనా?
- ఆంగ్ల విద్య ట్రైనింగ్‌కు దూరం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం (2022-23) నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య బోధన ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో గత కొన్నేండ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధించిన టీచర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆయా పాఠశాలల్లో మళ్లీ వీరికి అవకాశం కల్పిస్తారా? ప్రభుత్వ టీచర్లతో విద్యాబోధన చేయిస్తారన్నది ప్రభుత్వం ఇంకా తేల్చలేదు. ఒకవేళ ప్రభుత్వ టీచర్లతో విద్యాబోధన చేయిస్తే తాము రోడ్డునపడతామని ప్రయివేటు టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలల్లో తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 602 స్కూళ్లలో ఆంగ్ల బోధన చేస్తున్నారు. కాగా వచ్చే యేడాది ఇంగ్లీష్ బోధనకు సంబంధించి సమీక్షా సమావేశాల్లో ఉన్నతాధికారులు మౌఖికంగా చెప్పడమే తప్ప ఇప్పటి వరకు ఉత్తర్వులు మాత్రం రాలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రభుత్వ స్కూళ్లలోనూ ఆంగ్ల విద్యాబోధన జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 'మన ఊరు-మన బడి' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం ప్రధాన అజెండాగా ప్రకటిస్తూ.. ఈ నూతన విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని ప్రకటించింది. అయితే ఇప్పటికే ఐదారేండ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసీ(స్కూల్ మేనేజెమెంట్ కమిటీ)ల ఆధ్వర్యంలో ఆంగ్ల మాధ్యమం బోధన చేపట్టారు. అయితే, మూడేండ్లుగా ఎస్ఎంసీలు తీర్మానం చేస్తే విద్యాశాఖ అధికారికంగా ఆంగ్ల మాధ్యమ బోధనకు అనుమతిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 1156 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ప్రస్తుతం 602 స్కూళ్లలో ఆంగ్ల బోధన జరుగుతోంది. అందులో 326 ప్రాథమిక, 77 ప్రాథమికోన్నత, 184 ఉన్నత స్కూళ్లలో ఇంగ్లీష్ బోధన చేపడుతున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు జిల్లా విద్యాశాఖాధికారి అనుమతి ఇస్తుండగా.. ఆపై తరగతులకు కమిషనర్‌స్థాయి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆంగ్ల మాధ్యమం విద్య అందించేందుకు ఎస్ఎంసీ ఆసక్తిగా ఉంటే.. ఆ మేరకు తీర్మానం చేసి విద్యాశాఖ అధికారులకు పంపాల్సి ఉంటుంది. అయితే ఆంగ్ల బోధన టీచర్ల నియామకం, జీతభత్యాలు ఇవన్నీ ఎస్ఎంసీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. పేరెంట్స్ కమిటీ, ఎస్ఎంసీ, కొన్ని ప్రాంతాల్లో వీడీసీల సహకారంతో ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల బోధన చేపడుతున్నారు. స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లను నియమించుకుంటున్నారు. ఉన్నత పాఠశాలలో 10 మంది తీసుకుంటుండగా, ప్రాథమికోన్నతకు ఆరుగురు, ప్రాథమిక పాఠశాలకు ఇద్దరి నుంచి ముగ్గురిని నియమించుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ టీచర్లను ఏనాడూ పట్టించుకున్న పాపానపోలేదు. కోవిడ్ సమయంలోనూ ప్రయివేటు స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లకు కూడా ఆర్థిక సాయం ప్రకటించిన సర్కారు.. ప్రభుత్వ స్కూళ్లలో బోధిస్తున్న ఈ టీచర్లను మాత్రం కనికరించలేదు. అయినప్పటికీ.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ బోధనలో రాజీ పడకుండా సేవలందిస్తున్నారు.
మూడేండ్లుగా సేవలందిస్తున్నా
నాళేశ్వర్ ప్రభుత్వ పాఠశాలలో మూడేండ్ల నుంచి విద్యా వాలంటీర్‌గా సేవలు అందిస్తున్నా. ప్రస్తుతం ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను చేస్తున్నందున ఎన్నో రోజులుగా సేవలందిస్తున్న తమను తీసుకోవాలని కోరుతున్నాము.
- రాధిక, నాళేశ్వరం, నవీపేట్ మండలం
మార్గదర్శకాలు రాలేదు
వచ్చే యేడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమ బోధన గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చే వరకు తాము ఏమీ చెప్పలేమని అంటున్నారు. ప్రయివేటు టీచర్లకు అవకాశం కల్పిస్తారా లేక ప్రభుత్వ టీచర్లను నియమిస్తారా అన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
- విద్యాశాఖ అధికారులు