Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిలపక్ష నాయకుల డిమాండ్
- హైదరాబాద్ జిందాబాద్, సోషల్ మీడియా ఫోరం ఆధ్వర్యంలో సమావేశం
- 'గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలను కాపాడుకుందాం' అంశంపై చర్చ
నవతెలంగాణ-బంజారాహిల్స్
రాష్ట్ర ప్రభుత్వం 111 జీవో రద్దుపై శ్వేతపత్రం విడుదల చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ జిందాబాద్, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ఆధ్వర్యంలో 111 జీవో రద్దును నిరసిస్తూ 'గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలను కాపాడుకుందాం' అంశంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సోషల్ మీడియా ఫోరం మీడియా కన్వీనర్ దేశాయి కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల సమావేశం జరిగింది. సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీ అజీజ్ పాషా, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మహమూద్ అలీ, సీపీఐ రాష్ట్ర నాయకులు పశ్య పద్మ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోదండరెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త బివి. సుబ్బారావు, న్యాయ నిపుణులు సునీల్, టీజేఎస్ నాయకులు వెంకట్‌రెడ్డి, దొంతు నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి, ప్రముఖ భూ నిపుణులు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునీల్‌కుమార్, హైదరాబాద్ జిందాబాద్ అధ్యక్షులు అంజయ్య, ప్రధాన కార్యదర్శి వీరయ్య పాల్గొన్నారు.
111 జీవో రద్దును వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ జీవో రద్దయితే జంట జలాశయాలు మురికి కూపాలుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను సంప్రదించకుండా సీఎం కేసీఆర్ ఏకపక్షంగా 111 జీవో రద్దు చేస్తున్నట్టు ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. 84 గ్రామాల్లో 70 శాతం ప్రజలకు భూములు లేవన్నారు. కొంతమంది భూస్వాముల ప్రయోజనాల కోసం లక్షల మంది ప్రజల హక్కులు సీఎం కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చెరువులు, కుంటలు, శిఖం భూములు యథేచ్ఛగా అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు. చెరువుల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. చట్టాల కోసం ప్రజా ఉద్యమాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జర్నలిస్టులు కల్లూరి శ్రీనివాస్ రెడ్డి, దిలీప్ కుమార్, పల్లె రవి, అంజయ్య, ప్రవీణ్, శ్రీశైలం, శంకర్ శారద గౌడ్ తదితరులు పాల్గొన్నారు.