Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టిగ్లా హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇవ్వకుంటే మెరుపు ఉద్యమం చేపడతామని తెలంగాణ ఇంటర్మీడియెట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టిగ్లా) హెచ్చరించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం జంగయ్య, ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణగౌడ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న రెండు లక్షల మంది పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను ఇవ్వకుండా ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. దీంతో విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఉత్తీర్ణత తగ్గి ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా, మానసిక ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలంటే వెంటనే స్టడీ మెటీరియల్ను అందించాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మెటీరియల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. సులువుగా చదివేందుకు, మార్కులు ఎక్కువగా సాధించడానికి అవకాశముంటుందని తెలిపారు. ఇంటర్ బోర్డు అధికారులు ఇప్పటికైనా స్పందించి స్టడీ మెటీరియల్ను వీలైనంత తొందరగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే మెరుపు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.