Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో ఘటన
నవతెలంగాణ - మదనాపురం
రాష్ట్రంలో మహిళలు, బాలికలపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వరుస దుర్ఘటనలు జరుగుతున్నాయి. తాజా వనపర్తి జిల్లాలో పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన ఎనిమిదేండ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘటన మదనాపురం మండలం రామన్‌పాడ్ గ్రామ శివారులో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులో రైల్వే ట్రాక్ కరెంట్ లైన్ పనుల కోసం 45 రోజుల కిందట ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి 15 కుటుంబాలొచ్చాయి. అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని పనులు చేసుకుంటున్నారు. వారిలోని ఓ దుండగుడే దుర్మార్గానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఎనిమిదేండ్ల బాలిక ఇంటి వద్ద ఒంటరిగా ఉంది. తల్లి వంట చెరుకు కోసం బయటికెళ్లింది. ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన వలస కూలీ మచన్ షేక్ మాయమాటలు చెప్పి నివాసాలకు దూరంగా తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. బాలికకు రక్తస్రావం కావడంతో భయాందోళన చెందిన దుండగుడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి కర్ర గుచ్చుకుందని డాక్టర్‌కు చెప్పాడు. అనుమానం రావడంతో డాక్టర్ పోలీసులకు సమాచారం అందించి మెరుగైన వైద్యం కోసం వనపర్తి జిల్లాలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి అతన్ని రామన్‌పాడు గ్రామ శివారులోని దేవాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.