Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు దాసు సురేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పార్లమెంట్ లో బీసీ బిల్లు సాధన కోసం ఉత్తరాది రాష్ట్రాల మద్దతును సేకరిస్తున్నామనీ, అన్ని వర్గాల నుంచి తమకు సంపూర్ణ మద్దతు లభిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు దాసు సురేశ్ తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలోని కేజీ మార్గ్‌లో నిర్వహించిన ఓబీసీ సమావేశంలో పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, న్యాయవాదులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఢిల్లీ లోని స్థానిక ఓబీసీ నాయకులు హాజరయ్యారు. చిరకాల ఆకాంక్షలను నెరవేర్చే బీసీ బిల్లుకు తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగ, వాణిజ్య, పారిశ్రామిక, రాజకీయ రంగాలలో వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అందేలా బీసీ బిల్లు డ్రాఫ్ట్‌ను తయారుచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. బీసీ మేధావులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, ఉద్యమ కారులు, రాజకీయనాయకులు, విద్యార్థి నాయకులు, శ్రామిక వర్గాలతో పలు అంతర్గత చర్చలు నిర్వహించడంతో బాటు అన్ని రాష్ట్రాలలో క్షేత్ర స్థాయి పర్యటనలను త్వరలో నిర్వహిస్తామని తెలిపారు. జేఎన్‌యూ ఓబీసీ నేత ములాయం సింగ్ మాట్లాడుతూ.. ఉత్తరాదిన యూపీ, మధ్య ప్రదేశ్, బీహార్ , రాజస్థాన్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలలో ఓబీసీ ఉద్యమాన్ని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నామని చెప్పారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తమతో కలిసిరావడం శుభపరిణామమన్నారు. సమన్వయంతో ఓబీసీ ల పోరాటం బలంగా ముందుకు దూసుకెళ్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమలో అలహాబాద్ హై కోర్ట్ అడ్వకేట్ అనురాగ్ కిషన్(మధ్యప్రదేశ్), సీనియర్ జర్నలిస్ట్ స్వామి పాటిల్(మహారాష్ట్ర), కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుప్పు స్వామి, ప్రకాశ్ వర్మ, శ్రవణ్ కుమార్ ,రజత్ వర్మ తదితరులు పాల్గొన్నారు.