Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు
- హైదరాబాద్ నగరానికి తీవ్ర నష్టదాయకం : సీపీఐ(ఎం) నేత ఎం.శ్రీనివాస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 111 జీవో పరిధిలోని గ్రామాల్లో ఆంక్షలను రాష్ట్ర సర్కారు ఎత్తివేసింది. 84 గ్రామాల్లో ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ జీవో నెంబర్ 69ని పురపాలక శాఖ జారీ చేసింది. విధివిధానాల రూపకల్పన, సమగ్ర మార్గదర్శకాల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాల పరిరక్షణ, కాలుష్య నిరోధానికి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రీన్జోన్లు, సహ జోన్ల నిర్ధారణ కోసం విధివిధానాలు, ట్రంక్ వ్యవస్థ అభివృద్ధి కోసం మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది. రోడ్లు, డ్రైన్లు, ఎస్టీపీలు, డైవర్షన్ డ్రైన్ల నిర్మాణానికి నిధుల సమీకరణ చేపట్టాలని సూచించింది. వసతుల కల్పన, నియంత్రిత అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. లేఔట్, భవన అనుమతుల కోసం నియంత్రణ చర్యలు తీసుకోవాలనీ, నియంత్రిత అభివృద్ధి సమర్ధంగా జరిగేలా న్యాయపర చర్యల్లో మార్పులు చేయాలని సూచించింది. జంట జలాశయాల్లో మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మౌలిక వసతుల కల్పన కోసం నిధుల సమీకరణకు మార్గాలను అన్వేషించాలని సూచించింది. సీఎస్ నేతృత్వంలోని కమిటీ వీలైనంత త్వరగా నివేదిక అందజేయాలని ఆదేశించింది.
రియల్టర్లకే కోసమే ఆలోచనా? పర్యావరణం పట్టదా?
ఎం.శ్రీనివాస్, సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి
ఆంక్షల ఎత్తివేత జంట జలాశయాలకు తీవ్ర నష్టదాయకం. ఎంత సేపు రాష్ట్ర ప్రభుత్వం రియల్టర్ల కోసం, ఆదాయం సమకూర్చటంపైనే ఆలోచిస్తున్నది. పర్యావరణం పట్టదా? రాష్ట్ర సర్కారు నిర్ణయం హైదరాబాద్‌కు భవిష్యత్‌లో తీవ్ర నష్టం చేకూర్చనున్నది. ప్రకృతి సహజ వనరులను, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సోయే రాష్ట్ర సర్కారుకు లేదు. జంట జలశయాల పరిరక్షణ కోసం కమిటీ మొక్కుబడిగా వేసినదే. జలశయాల చుట్టుపక్కల రాజకీయ నేతలు, రియల్టర్లు భూములు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. వారికి లబ్ది చేకూర్చటం కోసమే 111 జీవో ఆంక్షలు ఎత్తివేత అనేది స్పష్టంగా అర్ధమవుతున్నది.