Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమాలకు పాల్పడిన వైద్యకళాశాలల అనుమతులు రద్దు చేయాలి
- కోఠిలోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వద్ద ధర్నాలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మేనేజ్మెంట్ సీట్లను ఎన్ఆర్ఐ సీట్లుగా మార్చి కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్న, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న ప్రయివేటు మెడికల్ పీజీ కాలేజీల అనుమతిని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు, డీవైఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎ.విజరుకుమార్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటరమేశ్ డిమాండ్ చేశారు. రాజకీయ నేతల కాలేజీలు కాబట్టే విచారణలో తాత్సారం జరుగుతున్నదని విమర్శించారు. ప్రయివేటు మెడికల్ పీజీ కాలేజీల్లో సీట్ల భర్తీపై విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడ్డ వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్‌లోని కోఠిలో గల తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఎదుట ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 'మెడికల్ కాలేజీల కుట్రలో సీట్లు కోల్పోయిన విద్యార్థులకు న్యాయం చేయాలి...వీ వాంట్ జస్టిస్...సిగ్గుసిగ్గు..వైద్యకళాశాలల వ్యాపారం సిగ్గుసిగ్గు..., సమగ్ర విచారణ జరిపించాలి..జరిపించాలి...' అంటూ నినాదాలు చేశారు. అనంతరం మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ హనుమంతరావుకు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ బృందం వినతిపత్రాన్ని అందజేసింది. అంతకుముందు ధర్నానుద్దేశించి వారు మాట్లాడుతూ..నీట్ కౌన్సిలింగ్లో మేనేజ్ మెంట్ సీట్లు మిగిలాయని చెప్పి ఎన్ఆర్ఐ కోటాలో ఇష్టారీతిన రూ.2 కోట్లకు పైగా అమ్ముకుంటూ రాష్ట్రంలోని ప్రయివేటు మెడికల్ కాలేజీలు వ్యాపారం చేస్తున్నాయని విమర్శించారు. కోట్ల రూపాయలకు సీట్లను అమ్ముకుంటున్నా కాళోజి యూనివర్సిటీ చోద్యంగా చూస్తున్నదని విమర్శించారు. ఇప్పటికే తెలంగాణలో కేవలం 2290 సీట్లు మాత్రమే ఉంటే అందులో సగం మేనేజ్మెంట్ కోటాలోనే ఉన్నాయని గుర్తుచేశారు. అయినా తీరని ధనదాహంతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం దుర్మార్గమని విమర్శించారు. మెడికల్ విద్యలో పీజీ సీట్లకు కౌన్సిలింగ్ జరుగుతున్న సమయంలో విద్యార్ధులను ప్రలోభపెట్టి ఇతర రాష్ట్రాల విద్యార్థులను తెలంగాణలో దరఖాస్తు చేయించి ఆ తర్వాత వారు సొంతరాష్ట్రానికి వెళ్లిపోయారని చెప్పి సీట్లను అమ్ముకోవడం పరిపాటిగా మారిందని వివరించారు. దీనివల్ల పేద, రాష్ట్ర విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్ధులకు వైద్య విద్య అందించే ఉద్దేశంతో ఏర్పాటైన కళాశాలలు కేవలం ధనదాహంతో పనిచేయడం దుర్మార్గమని విమర్శించారు. రాజకీయ నాయకులు నడుపుతున్న ఈ కళాశాలల దందాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలనీ, లేకపోతే ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యం ఆ కళాశాలల ముందు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రయివేటు కళాశాలలపై సమగ్రమైన విచారణ జరిపించి దోషులుగా తెలిన కళాశాలల వైద్యవిద్య గుర్తింపు శాశ్వతంగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు జావేద్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోశ్ రాథోడ్, బావికాడి శంకర్, హైదరబాద్ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, మేడ్చల్ అధ్యక్షుడు వెంకటేష్, రాము, శేఖర్, సాయి తదితరులు పాల్గొన్నారు.