Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందుకు కదిలిన మంగపేట ముంపు బాధితులు
- చందాలతో కొనసాగుతున్న గుట్ట తొలగింపు పనులు
- ప్రాజెక్టు కింద ముంచి వదిలేసిన సర్కార్
- నష్టపరిహారం అందక ఘొల్లుమంటున్న బాధితులు
నవతెలంగాణ - గంగాధర
ప్రాజెక్టు కింద ప్రభుత్వం భూములు తీసుకుంది.. ఇండ్లు.. భూములు ముంపునకు గురయ్యాయి. ఊరినే ముంచేసారు. కనీసం పరిహారం ఇవ్వలేదు.. ఆవాసాలూ నిర్మించలేదు.. ఊర్లోకి వెళ్లడానికి దారీ లేకుండా చేశారు.. పాములు, తేళ్లతో ఆవాసాల్లో ఉండలేక ఎన్నో ఏండ్లుగా సతమతం అవుతున్నామని ముంపు బాధితులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నేండ్లు ఎదురు చూసినా పరిహారం అందక, ముంపు కింద కోల్పోయిన ఇండ్లల్లో ఉండలేక బాధితులు, గ్రామస్తులు కలిసికట్టుగా చందాలు వేసుకుని గూడు కోసం గుట్టను తొలిచేందుకు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా గంగాధర ఎల్లమ్మ ప్రాజెక్టు మంగలపేట గ్రామం ముంపుకు గురవుతోంది. ఇండ్లు, భూములు కోల్పోయిన ముంపు బాధితులు, భూనిర్వాసితులకు దశాబ్ద కాలంగా ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు.. పునరావాసమూ కల్పించలేదు. ముంపు నుంచి బయట పడేందుకు గ్రామస్తులు ఏకమయ్యారు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న గుట్టను తొలగించి ఇండ్లు కట్టుకోవడానికి నడుం బిగించారు. ముంపు బాధితులు, గ్రామస్తులు చందాలు వేసుకుని.. సర్వే నంబర్ 1061లో 21.26 ఎకరాల విస్తీర్ణంలో ఎర్రమట్టితో కూడిన గుట్టను యంత్రాలతో తొలుస్తూ మట్టి తీసి చదును చేస్తున్నారు. అయితే, ఇప్పటికే గుట్టను ఆనుకుని గ్రామపంచాయతీ భవనం, రైల్వే స్టేషన్, పాఠశాల భవనం ఉన్నాయి. మిగతా గుట్టను తొలగించి మట్టిని చదును చేస్తే మరో 13ఎకరాల మేరకు ఖాళీ స్థలం ఉంటుంది. ముంపు కింద ఇండ్లు, భూములు కోల్పోయిన వారికి తొలి ప్రాధాన్యం ఇచ్చి ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు గ్రామస్తులు నిర్ణయించారు. మిగిలిన స్థలాన్ని గ్రామంలో ఉన్న సుమారు 230కుటుంబాలు ఇండ్లు నిర్మించుకోవడానికి సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. గుట్టను తొలిచేందుకు గ్రామస్తులు ఇంటికో 40 వేల రూపాయల చొప్పున సుమారు 60లక్షలు పోగుచేశారు. గ్రామస్తులు తీసుకున్న ఈ నిర్ణయం అంత అనధికారికమే అయినా.. పాలకులు, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
బాధితులకు అందని పరిహారం..
గంగాధర ఎల్లమ్మ ప్రాజెక్టు కింద 26ఇండ్లు, 120ఎకరాల మేరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ముంపుకు గురైనట్టు గ్రామస్తులు చెపుతున్నారు. అయితే, అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం మాత్రం 11ఇండ్లు, 86ఎకరాల 12గుంటల వ్యవసాయ భూములు ముంపు గురైనట్టు గుర్తించారు. సర్వే పూర్తై ఇండ్లు, భూములు ముంపు కింద కోల్పోయినట్టు గుర్తించి ఏండ్లు గడుస్తున్నా నేటికీ పైసా పరిహారం ఇవ్వలేదు. పాలకులు, అధికారులు ఇదిగో వచ్చే..అదిగో వచ్చే అనడం తప్పా పరిహారం అందించిన దాఖలాలు లేవని భూ నిర్వాసిత బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలు చేపట్టినా పట్టింపు కరువు
ఎల్లమ్మ ప్రాజెక్టు మంగపేట ముంపు బాధితులు, భూనిర్వాసిత రైతులు పునరావాసం, నష్ట పరిహారం కోసం అనేక సార్లు ఆందోళనలు చేపట్టినా అధికారులు, పాలకుల నుంచి పట్టింపు కరువైంది. పదేండ్లు గడుస్తున్నా పరిహారం అందడం లేదని గ్రామానికి వచ్చే అధికారికి, ఎమ్మెల్యేలకు మొర పెట్టుకున్నా చేస్తాం.. చూస్తాం.. అంటూ వెళ్లారే తప్పా ఆలకించిన వారే లేరని బాధితులు వాపోయారు.
రాకపోకలకు అడ్డుగా మారిన రైల్వేలైన్
ముంపుతో ఒక వైపు సతమతమవుతున్న మంగపేట గ్రామస్తులు.. మరోవైపు ఊళ్లోకి వెళ్లడానికి రహదారి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి వెళ్లే దారిలో రైల్వేలైన్ నిర్మాణం. మరో పక్క రైల్వేస్టేషన్ నిర్మించారు. దీంతో గ్రామానికి వెళ్లేందుకు రహదారి లేక కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామ శివారు నుంచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. వంతెన ఉన్నా కాలినడకకు తప్ప పెద్ద వాహనాలు వెళ్లడానికి లేదు.
గోడు పట్టించుకున్నోళ్లే లేరు
నాగెళ్లి మల్లారెడ్డి- మంగపేట ముంపు బాధితుడు
ప్రాజెక్టు కింద ఇండ్లు, భూములు ముంపు కింద పోయి పదేండ్లు అవుతుంది. పున రావాసం, నష్ట పరిహారం కోసం అధికారులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా పట్టించుకున్నోళ్లే లేరు. ఇండ్ల సమీపంలోకి ప్రాజెక్టు నీరు వచ్చి పాములు, తేళ్లు ఆవాసాల్లోకి చేరుతున్నయి. ఇండ్లలో ఉండలేక సతమతం అవుతున్నం. గత్యంతరం లేక ఇంటింటికి చందాలు వేసుకుని గుట్టను తొలిచి ఇండ్లు కట్టుకుందామని నిర్ణయించుకున్నాం.
సమిష్టి నిర్ణయంతో గుట్టను తొలగిస్తున్నం
బైరి మల్లారెడ్డి- మంగపేట గ్రామస్తుడు
గ్రామస్తులందరి సమిష్టి నిర్ణయంతోనే గుట్టను తొలగించి మట్టిని చదును చేస్తున్నం. ఎవరికి గోడు పెట్టుకున్నా పట్టించుకోలేదు. పునరావాసం, నష్ట పరిహారం చెల్లింపు చేయాలని అనేకసార్లు ఎమ్మెల్యే ఇంటి ముందు, రోడ్లపై బైటాయింపు, ఆఫీసుల ఎదుట ఆందోళనలు చేపట్టాం. ఏం చేసినా ఎవరూ కనికరం చూపలేదు.