Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణిలో 9 డిమాండ్లపై కుదిరిన అంగీకారం
- ఎన్నికల కోసమే మూడు డిమాండ్ల వాయిదా
- పోరాటాల ద్వారానే హక్కుల సాధన :సీఐటీయూ
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి
సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘకాలంగా జరిగిన చర్చల ఫలితంగా 9డిమాండ్లపై లిఖితపూర్వక ఒప్పందం కుదిరింది. బుధవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాలు, కార్మిక శాఖ అధికారుల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందం వివరాలు ఇలా ఉన్నాయి.. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వేలం వేయడానికి నిర్ణయించిన 4బొగ్గు బ్లాకుల విషయంపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపేందుకు కార్మిక సంఘాల ప్రతినిధి బృందాన్ని మే 10వ తేదీలోపు ఢిల్లీకి తీసుకెళ్తారు. కోవిడ్ కారణంగా సింగరేణి కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహణలో జరిగిన ఆలస్యం వల్ల 35సంవత్సరాల వయోపరిమితి దాటిన డిపెండెంట్ ఉద్యోగులకు అవకాశం ఇవ్వనున్నారు. మణుగూరులో డిస్మిస్ చేయబడిన ఈపీ ఆపరేటర్ రాఖీబ్కు తక్కువస్థాయి ఉద్యోగం ఇవ్వనున్నారు. కోవిడ్ కారణంగా చనిపోయిన కాంట్రాక్ట్ కార్మికులకు పదిహేను లక్షల రూపాయల అదనపు ఎక్స్‌గ్రేషియా ఇస్తారు. భార్యాభర్తలు ఇరువురూ సింగరేణి సంస్థలో లేదా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగులుగా ఉండి.. సింగరేణిలో పనిచేసే ఉద్యోగి మెడికల్ అన్‌ఫిట్ చేయబడి ఉద్యోగం లభించకుండా పెండింగ్‌లో ఉన్న వారికి డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకున్నది. గెజిట్ లేదా నోటరీ ద్వారా మార్పు పేర్లను సవరించడానికి అంగీకరించారు. అండర్ గ్రౌండ్లో పని చేయడానికి అనర్హులుగా గుర్తించిన మైనింగ్, టెక్నికల్, ఈపీ ఆపరేటర్ కార్మికులకు సర్ఫేస్‌లో సూటబుల్ ఉద్యోగం ఇవ్వడానికి, ఒక కమిటీని వేసి 60రోజుల్లో పరిష్కరించడానికి అంగీకరించారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు బ్యాంకు ద్వారా అదనంగా రూ.40లక్షల ఎక్స్గేషియాతోపాటు మ్యాచింగ్ గ్రాంట్, అవకాశం ఉంటే ఇతర బ్యాంకుల ద్వారా అదనపు ప్రయోజనాలు సమకూర్చి రూ.కోటి పరిహారం ఇవ్వటానికి అవగాహన కుదిరింది. పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగం ఆశిస్తున్న అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది.
ఈ ఒప్పందంపై కార్మిక సంఘాల నాయకులు మంద నరసింహారావు, నాగరాజు గోపాల్(సీఐటీయూ) వి.సీతారామయ్య, రాజ్‌కుమార్ (ఏఐటీయూసీి) బి.వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కేంగర్ల మల్లయ్య (టీబీజీకేఎస్), జనక్ ప్రసాద్, నరసింహారెడ్డి (ఐఎన్టీయూసీ), రియాజ్ అహ్మద్, రమేష్ (హెచ్ఎంఎస్) యాదగిరి సత్తయ్య, రవీందర్రావు (బిఎంఎస్) సింగరేణి డైరెక్టర్ 'పా' ఇ.బలరాం, జిఎం పర్సనల్ ఆనందరావు, కార్మిక శాఖ అధికారి ఇ.లక్ష్మణ్ తదితరులు సంతకాలు చేశారు.
ఐక్యతో ఒప్పందం కుదిరింది : సీఐటీయూ
సింగరేణి కార్మికులు ఐక్యంగా సమ్మె చేయడం వల్లే యాజమాన్యం దిగొచ్చి ఒప్పందం చేసుకున్నదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి, మందా నరసింహారావు వెల్లడించారు. ఎన్నికల కోసమే మరో మూడు ప్రధాన డిమాండ్లను పరిష్కరించకుండా వాయిదా వేశారన్నారు.