Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9682కోట్లు బకాయిలు: ప్రశాంత్ భూషణ్
- నిధుల విడుదలలో తీవ్ర జాప్యం.. రాష్ట్రాల్లో అనేక ఇబ్బందులు..
న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకం వేతనాల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతున్న తీరుపై విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్రం నుంచి నిధుల విడుదల సరిగాలేక ఉపాధి హామీ చట్టం అమలులో రాష్ట్రాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. పేదలు, వ్యవసాయ కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిలు వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని, కోవిడ్ సంక్షోభంతో ఉపాధి కోల్పోయిన వారంతా గ్రామాల్లో ఉపాధి పనులపై ఆధారపడ్డారని, అయితే వారికి సమయానికి వేతనాలు అందటం లేదని ఆయన సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యపై వెంటనే విచారణ చేపట్టాలని 'స్వరాజ్ అభియాన్' తరఫున న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, చెర్లీ డిసౌజాలు సుప్రీంను కోరారు. వారి దరఖాస్తును జాబితాల్లో పొందుపర్చడానికి సీజేఐ ఎన్.వి.రమణ అంగీకరించారు. ఉపాధి హామీ చట్టంలో పేర్కొన్నదాని ప్రకారం, వేతనాల్ని 15రోజుల్లోగా చెల్లింపులు పూర్తిచేయాలని గతంలో సుప్రీంకోర్టు కేంద్రానికి జారీచేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అంతేగాక వారికి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ సరుకులు అందజేయాలని చెప్పింది. నవంబర్ 26, 2021నాటికి ఉపాధి హామీ బకాయిలు రూ.9682కోట్లకు పేరుకుపోయాయి, గత ఆర్థిక సంవత్సరం కేటాయించిన నిధుల్లో 100శా తం ఖర్చు అయిపోయాయని కేంద్రం లెక్కలు చూపుతోందని, మరోవైపు అనేక రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాల్సిన బకాయిలు పేరుకుపోయాయని ప్రశాంత్ భూషణ్ సుప్రీంకు తెలియజేశారు. ''కోవిడ్-19 సంక్షోభం వల్ల ఎంతోమంది పేదలు ఉపాధి కోల్పోయారు. గ్రామాలకు తిరిగి వెళ్లారు. ఉపాధి హామీ పనులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. పనికోసం కొత్తగా దరఖాస్తు చేసిన వారికి జాబ్ కార్డ్‌లు ఇవ్వటం లేదు. ఉపాధి హక్కును కాలరాస్తున్నారు''అని ప్రశాంత్ భూషణ్ చెప్పారు. వేల కోట్ల రూపాయల బకాయిలు, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని..పని దినాల సంఖ్యను పెంచాలన్నారు. అదనంగా 50రోజులు పని కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.