Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండుటెండల్లో పనులు చేస్తున్న కూలీలు
- పని ప్రదేశంలో కన్పించని కనీస వసతులు
- ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రారంభం కాని పనులు
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
గ్రామీణ ఉపాధి హామీ కూలీలు ఎండకు మగ్గిపోతున్నారు. పనులే సక్రమంగా కల్పించని ప్రభుత్వం.. కూలీలకు పని ప్రదేశంలో కనీసం నీడ సౌకర్యం.. తాగునీరు అందించడం లేదు. కూలీల కోసం వసతితోపాటు మెడికల్ కిట్, నీటి వసతి కల్పించాల్సి ఉంది. కానీ ఎక్కడా అలాంటి సౌకర్యాలు కన్పించడం లేదు. దీంతో కూలీలు ఇండ్ల నుంచే నీటిని తీసుకెళ్తున్నారు. ఎండ తీవ్రత అధికమైతే సమీపంలో ఉండే చెట్ల కిందకు వెళ్తున్నారు. చెట్లు లేని ప్రదేశాల్లో ఎండకు మగ్గిపోతూ అనారోగ్యానికి గురవుతున్నారు.
వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలో 28 గ్రామ పంచాయతీలున్నాయి. 370 శ్రమశక్తి సంఘాలున్నాయి. 6 వేల మంది కూలీలున్నారు. ప్రస్తుతం 2,400 మంది ఉపాధి హామీ చట్టం పనులు చేస్తున్నారు. ప్రతిరోజూ పనులకెళ్లే కూలీలకు పని ప్రదేశంలో నీడ సౌకర్యం లేక ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోతున్నారు. రోజురోజుకూ ఎండల తీవ్రత అధికం కావడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆర్థిక సంవత్సరం ప్రారంభమై పాతిక రోజులైనా ఇంకా ఎక్కడా పనులు గుర్తించలేదు. కనీసం యాక్షన్ ప్లాన్ కూడా లేకపోవడంతో వారం రోజుల్లో రెండ్రోజులకు మించి పనులు కల్పించడం లేదు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో నేటికీ పనులు ప్రారంభించలేదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1693 గ్రామ పంచాయతీలున్నాయి. అందులో మహబూబ్నగర్ 442, నాగర్కర్నూల్ 461, వనపర్తి 255, గద్వాల 255, నారాయణపేట 280 చొప్పున గ్రామ పంచాయతీలున్నాయి. 2,600 మజారా గ్రామాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 12 లక్షల జాబ్ కార్డులున్నాయి. అందులో గతేడాది 1.60 లక్షల మందికి ఉపాధి పనులు కల్పించారు. అందులో 1250 మందికి మాత్రమే వంద రోజుల పని కల్పించారు. 5,600కు పైగా శ్రమశక్తి సంఘాలుండేవి. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించినప్పుడే అవి ఉనికిలో లేకుండా పోయాయి. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్, టీఏ, ఏపీఓ, ఎంపీడీఓ, ఆర్డీఓ స్థాయి అధికారులు పర్యవేక్షణ చేసేవారు. ప్రస్తుతం పనుల బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. దీంతో గ్రామ పరిపాలన, ఇతర పారిశుధ్యం వంటి పనులు చేయించేందుకే వారికి సమయం సరిపోవడం లేదు. ఈ క్రమంలో ఉపాధి పనులపై అంతంత మాత్రంగానే పర్యవేక్షణ చేస్తున్నారు. పని చేసే ప్రదేశాల్లో ఎక్కడా కూడా కూలీల కోసం టెంట్లు ఏర్పాటు చేయలేదు. ఎవరి నీరు వారే వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ పాకెట్లు మచ్చుకైనా కన్పించవు. పనులు చేసినా చాలా మందికి కూలి డబ్బులు వేయలేదు. అటు వ్యవసాయ పనుల్లేక, ఇటు ఉపాధి కూలి డబ్బులు విడుదల చేయకపోవడంతో కూలీలు ఆర్థికంగా ఇబ్బందులకు గురౌతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.2.50 కోట్లకు పైగా బకాయిలున్నట్టు తెలుస్తోంది.
పనుల్లేక..
గిరి- లింగాల మండలం
- నాగర్కర్నూల్ జిల్లా
మాకు ఈ ఏడాది ఉపాధి పనుల్లేకపోవడంతో పూట గడవడం కష్టంగా మారింది. పది రోజుల నుంచి ఉపాధి పనుల కోసం ఎదురు చూస్తున్నా.. పనులు చూపించడంలేదు.
ఉపాధి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
కడియాల మోహన్- వ్యకాస జిల్లా అధ్యక్షులు- మహబూబ్నగర్
ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా పనులు గుర్తించలేదు. వెంటనే పనులు గుర్తించి పని కల్పించాలి. వేసవిలో నీడ, నీటి సౌకర్యం కల్పించాలి. అలాగే, పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి.
కేంద్రం విధానాలతో కూలీలకు ఇక్కట్లు
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతుండటం ఉపాధిహామీ పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎండలకు ఉపాధి కూలీలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8గంటలకే మాడ పగిలిపోయే విధంగా ఎండ ఉండటం..పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇంటి నుంచే తాగునీటిని తీసుకెళ్తున్నారు. ఇప్పటికే వడదెబ్బ కారణంగా నిర్మల్ జిల్లాలో ఓ మహిళ మృతి చెందడం, వివిధ ప్రాంతాల్లో పలువురు కూలీలు అస్వస్థతకు గురైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మరోపక్క కేంద్ర ప్రభుత్వం నూతన హాజరు విధానం తీసుకురావడం కూలీలకు మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా హాజరు వేసి ఆన్లైన్లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ విధానం కూలీలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. గతంలో ఉదయం 6గంటలకు పనికి వెళ్లి ఎండ తీవ్రత పెరగకముందే ఇంటికొచ్చేసే కూలీలు తాజా నిబంధనలతో మిట్టమధ్యాహ్నం కూడా పనులకు వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా ఎండ ప్రభావానికి గురై అనారోగ్యం బారినపడాల్సి వస్తోందని పలువురు కూలీలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనిపించని మెడికల్ కిట్లు
నవతెలంగాణ-మల్హర్రావు
'ఉపాధి హామీ పనుల్లో రోజూ ఎర్రటి ఎండలో పని చేసినా.. కూలి గిట్టుబాటు కావడం లేదు. భూమి గట్టిగా ఉండడం వల్ల ఎక్కువగా పని చేయలేక పోతున్నాం. ప్రభుత్వం స్పందించి కూలి గిట్టుబాటు అయ్యేలా చూడాలి.' అని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మల్హర్రావు మండలంలోని లక్ష్మీ అనే కూలీ ఆవేదన వ్యక్తం చేసింది. ఉపాధి హామీ పనుల్లో పాటించాల్సిన నిబంధనలు, నియమాలు ప్రభుత్వం, అధికారులు గాలికొదిలేస్తున్నారు. కూలీలు మండుటెండలో పనులు చేయాల్సి వస్తోంది. తాగడానికి మంచినీరు, వడదెబ్బ తగలకుండా వోఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు లాంటి సదుపాయాలు ఎక్కడా.. కనిపించడం లేదు. గతంలో పని చేసే చోట టెంట్లు వేసేవారు ప్రస్తుతం వేయడం లేదని కూలీలు తెలిపారు. పనిచేసే చోట టెంట్లతోపాటు మెడికల్ కిట్లు ఏర్పాటుచేయాలని చిన మల్లయ్య అనే కూలీ తెలిపారు.