Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నమ్మితే నిలువునా ముంచుతారు
- నల్లధనం ఎంతమందికి పంచావు ?
- ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడికిపాయే !
- కేసీఆర్‌కే తెలంగాణ ప్రజల బాధలు తెలుసు
- నర్సంపేటలో ఆహార శుద్ధి పరిశ్రమ, రింగు రోడ్డుకు గ్రీన్ సిగల్:
నర్సంపేట బహిరంగ సభలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-నర్సంపేట
'బీజేపోళ్లు పచ్చి మోసగాళ్లు.. నమ్మితే నిలువునా ముంచుతారు.. మోడీ నల్లధనం ఎంతమందికి పంచావు.. ఒక్కో ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని చెప్పావు.. ఒక్కరి ఖాతాలోనైనా పడ్డాయా.. యేడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్నావు.. ఎంత మందికి ఇచ్చావు.. మోడీ మాటలు కోటలు దాటుతాయి.. చేతలు మాత్రం గడపదాటవు' అంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. బుధవారం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. ఇంటింటికీ గ్యాస్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన పీఎన్జీ గ్యాస్ లైన్‌ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలని, ఏనాటికైనా తెలంగాణ బాధలు తెల్సినోడు ఒక్క కేసీఆర్ మాత్రమేనని నొక్కి చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు ఇక్కడి బాధలు తెల్వవన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ రైతు బంధు పథకంతో ఏడాదికి రూ.10వేల పెట్టుబడి సాయం అందిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు రూ.50వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. రూ.22వేల కోట్ల రైతు రుణమాఫీకి విడుదల చేశారన్నారు. నాడు కాంగ్రెస్ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉంటే తామొచ్చాక రూ.200లకే ఇస్తామని చెప్పిన బీజేపీ నేడు రూ.1050కి పెంచేసి నెత్తిన భారం మోపారని విమర్శించారు. ప్రజలకు ఈ భారాన్ని తగ్గించేందుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం ఇంటింటికీ గ్యాస్ అందించిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డికే దక్కుతుందన్నారు. నర్సంపేటలో పీఎన్జీ గ్యాస్ లైన్ కింద 12,600 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. కేవలం రూ.600కే 45 రోజుల పాటు పైప్‌లైన్ ద్వారా ఇంటింటా గ్యాస్ సరఫరా లాంఛనంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు.. నర్సంపేటలో వ్యవసాయ ఆధారిత ఆహార శుద్ధి పరిశ్రమలను నెలకొల్పుతామన్నారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా పండించే మొక్కజొన్న, వరి, పత్తి, పసుపు, మిర్చి పంటలకు గిట్టుబాటు ధర పలికేందుకు ఈ పరిశ్రమలు ఉపయోగపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు అనుమతులతో పాటు రూ.50 కోట్లు మంజూరు చేస్తామన్నారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులతో నేడు తెలంగాణ సస్యశ్యామలమైందనీ, రూ.670 కోట్లతో పాకాల, రంగయచెరువులోకి గోదావరి నీరు తీసుకొచ్చామన్నారు. మరో 60వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లందించడం గర్వకారమన్నారు. నేడు ఎస్సారెస్పీ టెలాండ్ ఆకరి ఆయకట్టుకు కూడా నీళ్లు పారుతుందని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రూ.2వేల పింఛన్, 973 గురుకులాల్లో నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలనూ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలతో పేదింటి తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. అనంతరం రూ.100 కోట్ల విలువజేసే లింకేజీ రుణాలు, అభయహస్తం ఫించన్ల చెక్కులను పంపిణీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పలు రకాల పోటీల్లో గెలిచిన మహిళలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ గోపీ, సీడీఎంఏ సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.