Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగార్ధుల కోసం ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు
- ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేలా ఆరు యూనివర్సిటీల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతోనే రాష్ట్ర ఆవిర్భావం జరిగిందనీ, నీళ్లు వచ్చేశాయి...ఇప్పుడు నియామకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. బుధవారంనాడామె మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా ఆరు యూనివర్సిటీల్లోని ఉచిత కోచింగ్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లావారికే దక్కాలనే ఉద్దేశ్యంతో జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించాక, 317 జీవో అమలు చేస్తూ ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించిందని తెలిపారు. విద్యాశాఖలో దాదాపు 20వేల ఉద్యోగాల భర్తీ జరుగుతున్నదని చెప్పారు. యూనివర్సిటీ ఉచిత కోచింగ్ సెంటర్లలో డ్రాపవుట్లు లేకుండా చూడాలనీ, అప్డేటెడ్ మెటీరియల్‌ను అందించాలని సూచించారు. ప్రయివేటు కోచింగ్ సెంటర్ల ఫీజుల దోపిడీ నియంత్రణ కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ యూనివర్సిటీల్లో పోటీ పరీక్షల ఉచిత శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అంతకుముందు ఆయా యూనివర్సిటీల్లో శిక్షణకు ఎంపికైన విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖాముఖి మాట్లాడారు. 'శ్రమ నీ ఆయుధం అయితే, విజయం నీ బానిస అవుతుంది' అంటూ వారిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.