Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీ పేరిట కోత
- అన్నదాతలపైనే భారం
నవతెలంగాణ- మిర్యాలగూడ
మొన్నటి వరకు పంటను ఎవరూ కొనక.. కొన్నా అడ్డికి పావుసేరు అన్నట్టు తక్కువ ధరకు తీసుకున్న వ్యాపారులు, మిల్లర్లు.. ఇప్పుడు బిల్లుల చెల్లింపును నెల రోజులకు వాయిదా వేస్తున్నారు. దాంతో పంట చేతికి రాగానే అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఆశతో ఉన్న రైతులకు నిరాశే మిగులుతుంది. ధాన్యం అమ్మిన నెల రోజులకు కూడా డబ్బులు రాకపోవడంతో చేసిన అప్పులకు అదనంగా వడ్డీ భారం పడుతుంది. మిల్లర్లు గడువులు పెడుతూ రైతులను మిల్లుల చుట్టూ తిప్పుకుంటున్నారు. మిల్లర్ల అన్ని షరతులకు తలొగ్గి ధాన్యం అమ్ముకొని అన్నదాతలు నిండా మునిగి పోతున్నారు.
మిల్లుకు ధాన్యం వచ్చిన 24 గంటల తర్వాత ధాన్యం కొంటున్నారు. అది కూడా తక్కువ ధర వేసి తీసుకుంటున్నారు. కొన్న ధాన్యానికి ఏ ధర వేశారో రశీదుపై చూపడం లేదు.. కేవలం ఎన్ని క్వింటాళ్ల ధాన్యం అయిందో చూపుతున్నారు. దానిపై తమ మిల్లుకు సంబంధించిన రబ్బర్ స్టాంప్ ద్వారా బిల్లుకు 25 రోజుల తర్వాత రావాలంటూ ముద్ర వేస్తున్నారు. కొన్ని మిల్లుల్లో అయితే.. నెల రోజుల తర్వాత రావాలంటూ ముద్ర వేస్తున్నారు. మరికొందరు 20 రోజులు, 15 రోజులు అంటూ గడువు పెడుతున్నారు. ఆ గడువు దాటినా నగదు లేవు.. రేపు మాపంటూ తిప్పుకుంటున్నారు. దీనితో ధాన్యం డబ్బుల కోసం మిల్లుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
సీసీ కటింగ్ పేర కోత
ధాన్యం డబ్బులు చెల్లించే విషయంలో మిల్లర్లు రైతులకు కోత పెడుతున్నారు. గడువు దాటినా నగదు చెల్లింపు విషయంలో సీసీ కటింగ్ కోత పెడుతున్నారు. 2 రూపాయల చొప్పున కటింగ్ చేస్తున్నారు. లక్ష రూపాయల బిల్లు అయితే.. 2 రూపాయల సీసీ కటింగ్ చొప్పున రూ.2000 కట్ చేసి రైతుకు రూ.98000 మాత్రమే ఇస్తున్నారు. తక్షణమే బిల్లు కావాలంటే ఐదు శాతం కటింగ్ పెట్టి నమోదు చేస్తున్నారు. అదే చెక్కు రూపంలో అయితే ఒక్క శాతం కట్ చేసుకొని ఇస్తున్నారు. ధాన్యం కొనేటప్పుడు బిల్లు ఆలస్యమవుతుందని రైతులకు ముందే చెప్పి దాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. గడువుకు ఒప్పుకోకపోతే ధాన్యం కొనుగోలు చేయకుండా నిరాకరిస్తున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో రైతులు ధాన్యం అమ్ముకొని నష్టపోతున్నారు.