Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూజీ సీట్లలోనూ..
- ఏండ్లుగా నడుస్తున్నా చర్యలేవి.. ప్రభుత్వ ఉత్తర్వుల లోపమే..
- దర్యాప్తుతో జరిగిందేంటి..?
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లలో బ్లాక్ దందా నడుస్తోంది. కేవలం నీట్ పీజీ సీట్లలోనే కాదు.. నీట్ యూజీ సీట్లలోనూ ప్రయివేటు మెడికల్ కాలేజీలు ఈ దందాను కొన్నేండ్లుగా గుట్టు చప్పుడు కాకుండా నిర్వి రామంగా నడిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు మాత్రం రెండ్రోజుల క్రితమే దీనిపై స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. బీ కేటగిరి సీట్లను సీ కేటగిరికి మారేలా చేసి ఒక్కో సీటును రూ.కోటి నుంచి రూ.కోటీన్నర వరకు ప్రయివేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు దండుకుంటున్నాయి. ఇందులో దళారుల పాత్రా లేకపోలేదు. యూనివర్సిటీ ఉన్నతాధికారులకు సైతం ఎవరి వాటాలు వారికి యాజమాన్యాలు ఇస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ అధికారులు మీడియాను దరిచేరనీయకుండా ముందస్తు జాగ్రత్తలూ తీసుకున్నారు. కాగా, ఈ దందా సజావుగా నడవడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉన్న లొసుగులే కారణమని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉన్న లోపాలతోనే ప్రయివేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు నీట్ పీజీ, యూజీ సీట్లలో బ్లాక్ దందాకు తెరలేపినట్టు తెలుస్తోంది.. మెడికల్ కౌన్సెలింగ్‌లో బీ కేటగిరీ సీట్లను బ్లాక్ చేయడం వల్ల ఆ సీట్లు సీ కేటగిరికి వెళ్తుంది. అంటే సీ కేటగిరి సీట్లకు అదనంగా వచ్చి చేరుతుంది. బీ కేటగిరిలో సీటు వచ్చిన వారు ఆ సీటును క్యాన్సిల్ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కల్పించింది. ఈ క్రమంలో ఈ నిబంధనను ఆసరా చేసుకొని ప్రయివేటు మెడికల్ కాలేజీలు కొన్నేండ్లుగా కోట్లాది రూపాయలను దండుకుంటున్నా చర్యలు లేవు.
జరిగిందేమిటీ..?
నీట్ పీజీ, యూజీ సీట్లలో బి కేటగిరిలో ప్రయివేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు, దళారులను రంగంలోకి దించి మంచి మార్కులు వచ్చిన అభ్యర్థుల నీట్ ర్యాంకు కార్డులు, ధ్రువీకరణ పత్రాలు తీసుకొని సదరు అభ్యర్థులకు సైతం రూ.3-5 లక్షలు చెల్లిస్తారు. ఈ దందాలో క్రియాశీలక పాత్ర పోషించే దళారులు యూజీ సీట్లకు రూ.2 లక్షలు, పీజీ సీటుకు రూ.5-10 లక్షలు కమిషన్‌గా పొందారు. ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలే బీ కేటగిరిలో సదరు అభ్యర్థి పేరిట దరఖాస్తు చేయడం, సీటు రాగానే ఫీజు చెల్లించడం, చివరి నిమిషంలో ఆ సీటును రద్దు చేసుకోవడం చేసుకుంటారు. దీనిలో బి కేటగిరి సీటును రద్దు చేసుకోవడం ద్వారా ఫీజులో కొంత ప్రయివేటు మెడికల్ కాలేజీ యాజమాన్యం నష్టపోతుంది. కాని బీ కేటగిరి సీటు సీ కేటగిరిలో చేరితే ఆ సీటును పొందే అభ్యర్థి నుంచి రూ.కోటి నుంచి రూ.1.50 కోట్ల వరకు ఫీజు వసూలు చేసుకుంటున్నారు.
మీడియాకు దూరంగా..
వరంగల్‌లోనే కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉన్నా యూనివర్సిటీ వర్గాలు స్థానిక మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వైస్‌ఛాన్స్‌లర్, రిజిస్ట్రార్లు మీడియాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా దూరంగా వుండటం గమనార్హం. ఎలాంటి సమాచారం అడిగినా పీఆర్ఓను సంప్రదించి తెలుసుకోవాల్సిందే తప్పా నేరుగా సంప్రదించడానికి అవకాశం లేదు. ఫోన్లో సంప్రదించాలన్నా వారు ఫోన్ ఎత్తరు. దాంతో యూనివర్సిటీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి వుంది.