Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రెంజల్
ప్రమాదవశాత్తు అలీ సాగర్ ఎత్తిపోతల పథకం కాలువలో పడి బావ బామ్మర్ది మృతిచెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బాగేపల్లిలో బుధవారం జరిగింది. ఎస్ఐ పి.సాయన్న కథనం ప్రకారం.. జిల్లాలోని బోధన్ మండలం కల్దుర్కి గ్రామానికి చెందిన శ్రీకాంత్ (24), ఖండ్గావ్ గ్రామానికి చెందిన శ్రావణ్ (16) ఈనెల 20న రెంజల్ మండలం బాగేపల్లి గ్రామంలోని తమ బంధువుల పెండ్లికి వచ్చారు. అయితే రాత్రి అక్కడే పడుకొని తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లారు. ఈ క్రమంలో శ్రీకాంత్ ప్రమాదవశాత్తు లిఫ్ట్ కాలువలో పడిపోవడంతో గమనించిన శ్రావణ్ వెంటనే అతన్ని రక్షించడానికి వెళ్లగా ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. వీరిద్దరూ ఎంతసేపటికీ రాకపోవడంతో శ్రావణ్ తండ్రి యోగేష్ లిఫ్ట్ కాలువ వైపు వెళ్లి చూడగా వారు దాంట్లో మునిగినట్టు తెలుసుకొని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సాయన్న మృతదేహాలను బయటకు తీయించి పంచనామా నిర్వహించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.