Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో నాలుగు విభాగాల్లోనూ అవార్డులు
- మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా అందుకున్న సీపీఆర్వో కె.సూర్యనారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం సింగరేణి కాలరీస్ కార్పోరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) తో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పొందుపరుస్తూ రూపొందించిన లఘు చిత్రానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించిందని ఆ సంస్థ నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ ఐ) హైదరాబాద్ ఛాప్టర్ స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా హౌటల్ లో నిర్వహించిన మూడో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్స్ సదస్సులో పీఆర్ఎస్ఐ ఉత్తమ సీఎస్ఆర్ ఫిల్మ్ పురస్కారాన్ని సింగరేణి కాలరీస్ సంస్థకు ప్రదానం చేశారని పేర్కొన్నారు. సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా సంస్థ జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్, మార్కెటింగ్ , చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) కె.సూర్యనారాయణ ఈ పురస్కారాన్ని అందుకున్నట్టు తెలిపారు. దక్షిణ భారత దేశ ఇంధన అవసరాలు తీర్చడంతోపాటు కార్పోరేట్ సామాజిక బాధ్యతతో ఏటా దాదాపు రూ.70 కోట్ల నిధులను సమాజ అభివృద్ధికి సింగరేణి వెచ్చిస్తోందనీ, ఈ సీఎస్ఆర్. కార్యక్రమాలన్నింటిని పొందుపరుస్తూ రూపొందించిన కార్పోరేట్ సీఎస్ఆర్ వీడియోను అవార్డుకు ఎంపిక చేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు. కార్యక్రమంలో పీఆర్ఎస్ఐ. జాతీయ అధ్యక్షులు డాక్టర్ అజిత్ పాఠక్, సెక్రటరీ జనరల్ వై.బాబ్జీ, జాతీయ ఉపాధ్యక్షులు (సౌత్) యు.ఎస్.శర్మ, హైదరాబాద్ చాప్టర్ చైర్మెన్ డాక్టర్ పి.వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొనానరు.