Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వారీల నిర్వహణ, ఖనిజ రేట్లు భారీగా పెంపు
- దరఖాస్తు రుసం వెయ్యి నుంచి లక్షకు పెరుగుదల
- రెన్యూవల్ రూ.25 వేల నుంచి రూ. 4 లక్షలు
- క్వారీ ట్రాన్స్ఫర్ రూ.10 లక్షలు
- లబోదిబోమంటున్న కాంట్రాక్టర్లు
- రాష్ట్రవ్యాప్తంగా క్రషర్స్ సమ్మె
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో క్వారీల నిర్వహణ పెను భారంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ధరల సవరణ పేరిట భారీగా రుసుములు పెంచింది. క్వారీ అప్లికేషన్ రుసుం గతంలో వెయ్యి ఉండగా.. ఏకంగా రూ.లక్షకు పెంచింది. క్వారీ రెన్యూవల్, ట్రాన్స్ఫర్ ఫీజులను కూడా లక్షల్లో పెంచేసింది. అలాగే ఖనిజాల ధరలను కూడా భారీగా పెంచింది. రాయల్టీ ధరలకు అదనంగా కొత్తగా పర్మిట్ ఫీజు ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై క్వారీ కాంట్రాక్టర్లు, నిర్వహకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ధరలను సవరించాలని రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపడుతున్నారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్నామని, కొత్తగా ఈ ధరలు మోపడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారయ్యిందని వాపోతున్నారు. సర్కారు పెంచిన ధరలను ఉపసంహరించుకునే వరకు సమ్మె చేపడతామని చెబుతున్నారు.
భూగర్భ గనుల శాఖ ఖనిజ ధరలు, క్వారీల నిర్వహణ ధరలను భారీగా పెంచింది. ఈ మేరకు మార్చి 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నిజామాబాద్‌లో 33 కంకర క్వారీలున్నాయి. ముఖ్యంగా క్వారీల నిర్వహణ ధరలను పొంతన లేకుండా పెంచేసిందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. గతంలో క్వారీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు రుసుం వెయ్యి చెల్లిస్తే సరిపోయేది. కానీ రాష్ట్ర సర్కారు ఏకంగా రూ.లక్షకు పెంచింది. క్వారీ ఒప్పందం పూర్తయిన తరువాత రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రుసుం గతంలో రూ.25వేల నుంచి రూ.50 వేల మధ్య ఉండగా ఇప్పుడు రూ. 4 లక్షలకు పెంచారు. ఇక క్వారీ నిర్వహణ బదిలీ ఛార్జీలు గతంలో రూ.50 వేలు ఉండగా.. ప్రస్తుతం ఏకంగా రూ.10 లక్షలకు పెంచిందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. నిర్వహణతో కంకర, ఇసుక, మార్బుల్, మోరం, గ్రానైట్‌తో పాటు షెడ్యూల్-3లోని ఖనిజాల ధరలను సైతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మైనింగ్ చట్టం ప్రకారం ప్రతి మూడేండ్లకు ఒకసారి ధరలు పెంచాల్సి ఉన్పప్పటికీ.. గత ఆరేండ్లుగా పెంచలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే కొత్తగా రాయల్టీ పెంచడంతో పాటు మెట్రిక్ టన్నుకు 80 శాతం చొప్పున పర్మిట్ ఫీజు తీసుకొచ్చింది. దాంతో ఒక్కసారిగా ధరలు రెండింతలయ్యాయి. సాధారణంగా ప్రతియేడు కంకర, ఇసుక, మొరం ఇతర ఖనిజాలకు క్వారీ కాంట్రాక్టర్లు, నిర్వాహకులు మెట్రిక్ టన్నుకు ప్రభుత్వానికి రాయల్టీ రూ.50తో పాటు డీఎంఎఫ్(డిస్ట్రిక్ మినరల్ ఫౌండేషన్) 30 శాతం, ఎస్ఎంఈటీ(స్టేట్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్యాక్స్) 2 శాతం, ఐటీ 2 శాతం చెల్లించాల్సి ఉండేది. ఈ లెక్కన ఒక మెట్రిక్ టన్ను ఇసుక, కంకర, మొరానికి అన్ని పన్నులు కలిపి గతంలో రూ.67 చెల్లిస్తే సరిపోయేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ధరలు సవరించింది. ఆ ప్రకారం ఒక్కో మెట్రిక్ టన్నుకు రాయల్టీ రూ.65కు పెంచింది. దీనికి కొత్తగా పర్మిట్ ఫీజు 80 శాతం విధించింది. ఇక డీఎంఎఫ్, ఎస్ఎంఈటీ, ఐటీలతో కలిపితే ప్రస్తుతం ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.139 చెల్లించాల్సి వస్తోంది.
ఈ ధరలతో కాంట్రాక్టులు చేపట్టలేమని క్వారీ నిర్వాహకులు వాపోతున్నారు. రెండేండ్లుగా కరోనాతో పరిశ్రమ మొత్తం దెబ్బతిన్నదని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ప్రభుత్వం ఈ విధంగా ధరలు పెంచడం సరికాదని వాపోతున్నారు. కరోనా సమయంలో వేలాది రూపాయలు కరెంటు బిల్లులు చెల్లించామని, క్వారీ పర్మిట్ రద్దు కాకుండా అవసరం లేకున్నా సర్కారుకు నెలకు టార్గెట్ చొప్పున పర్మిట్లు తీశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన సర్కారు ఈ విధంగా ధరలు పెంచిందో అర్థం కావడం లేదని వాపోతున్నారు.
గృహనిర్మాణాలకు బ్రేక్..
నిజామాబాద్ జిల్లాలో గృహనిర్మాణ రంగం స్పీడ్ మీద ఉన్నది. దానికితోడు వేసవికాలం కావడంతో చాలా మంది యజమానులు గృహ నిర్మాణాలను ప్రారంభించారు. కానీ ప్రస్తుత సమ్మెతో నిర్మాణాలకు బ్రేక్ పడింది. పిల్లర్ల నుంచి మొదలు స్లాబ్ వరకు ప్రతి పనికీ కంకర అవసరం కానీ సమ్మెతో జిల్లావ్యాప్తంగా సరఫరా నిలిచిపోయింది. ఇక కంకర లభ్యం కాకపోవడంతో ఆ ప్రభావం ఇసుక, సిమెంట్, సలాక అమ్మకాలపై పడింది.
నిర్వహణ భారంగా మారింది
జమీల్, నిజామాబాద్ జిల్లా స్టోన్ క్రషర్స్ కార్యదర్శి
క్వారీల నిర్వహణ ఇప్పటికే పెనుభారంగా తయారయ్యింది. కరెంటు బిల్లులు, వేతనాలు, మిషన్ల నిర్వహణతో ఏమీ మిగలడం లేదు. ఈ సమయంలో వేలల్లో ఉన్న ఫీజులను లక్షల్లో పెంచడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పున:సమీక్షించాలి.
మధ్య తరగతి ప్రజానీకంపై భారం
అనంతయ్య, కాంట్రాక్టర్ జానకంపేట్
రాష్ట్ర ప్రభుత్వం క్వారీల నిర్వహణ, ఖనిజాలపై పెంచిన ధరలు అంతిమంగా ప్రజలకు పెను భారంగా తయార వుతాయి. సర్కారు ధరలు పెంచడంతో ఆ ధరలకు అనుగుణంగా ధరలు పెంచాల్సి ఉంటుంది. ఆ ప్రభావం గృహ యజమానిపై పడుతుంది. ఇప్పటికే పెరిగిన సలాక, సిమెంట్ ధరలతో స్వంత ఇండ్లు కట్టుకోవడానికే జనం జంకుతున్నారు. ఈ సమయంలో ఈ స్థాయిలో ధరలు పెంచడం సరికాదు.