Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ప్రక్రియ పూర్తి
- యాజమాన్యాల వారీగా ఇచ్చేందుకు కసరత్తు
- మోడల్ స్కూల్ టీచర్లకూ బదిలీలు, ప్రమోషన్లు
- కేజీబీవీ సిబ్బందికి స్థానచలనం
- కోర్టు అనుమతితో పండితులు, పీఈటీల అప్‌గ్రెడేషన్
- ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మంత్రి సబిత అంగీకారం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం సూత్రప్రాయంగా గ్రీన్‌సిగల్ ఇచ్చింది. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆయా యాజ మాన్యాల వారీగా బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వం అంగీకరించింది. తొలుత పదోన్నతులు, ఆ తర్వాత బదిలీలు వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో గురువారం హైదరాబాద్‌లో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఇందులో ఎమ్మెల్సీలు అలుగుబెల్లి నర్సిరెడ్డి, కె జనార్ధన్‌రెడ్డి, కె రఘోత్తంరెడ్డి, సురభి వాణీదేవి, ఉపాధ్యాయ సంఘాల నేతలు కె జంగయ్య, టి లక్ష్మారెడ్డి (టీఎస్‌యూటీఎఫ్), పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు (పీఆర్టీయూటీఎస్), విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఇచ్చేందుకు మంత్రి అంగీకరించారు. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సైతం వచ్చేనెలలో బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుత జోన్ల ప్రకారమే నిర్వహించాలని నిర్ణయించారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఖాళీల మేరకు స్థానచలనం కల్పించేందుకు అంగీకరించారు. పదోన్నతులకు సంబంధించిన సర్వీస్ రూల్స్ రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించినట్టు తెలిసింది. పరస్పర బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను రెండు, మూడు రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా వివరించారు. వాటితోపాటు సీనియార్టీ, మెడికల్ సంబంధిత అప్పీళ్లనూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
23,809 మందికి పదోన్నతి
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తొలుత గెజిటెడ్ హెడ్మాస్టర్ (జీహెచ్ఎం) బదిలీలు నిర్వహిస్తారు. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)లకు వందశాతం జీహెచ్ఎంలుగా పదోన్నతులు కల్పిస్తారు. ఎస్ఏ పోస్టుల్లో ఏర్పడ్డ ఖాళీల్లో 70 శాతం పదోన్నతులు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)లు, పండితులు, పీఈటీలకు ఇస్తారు. ఎంఈవో, డిప్యూటీ ఈవో, డీఈవో, డైట్ లెక్చరర్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే ఈనెల 25న ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (జీటీఏ) నాయకులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఆయా పోస్టులకు సంబంధించిన పదోన్నతుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు, స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు వాటా వచ్చేలా ప్రతిపాదించాలని నిర్ణయించారు. కొత్త మండలాలు, కొత్త జిల్లాలకు ఎంఈవో, డీఈవో పోస్టులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వెబ్‌కౌన్సెలింగ్ ప్రాతిపదికన ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని అంగీకరించారు. రాష్ట్రంలో 23,809 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించే అవకాశమున్నది. రాష్ట్రంలో 8,270 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిసింది. ఇందులో 30 శాతం పోస్టులు నేరుగా భర్తీ చేస్తారు. మిగిలిన 70 శాతం పోస్టులను ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు పదోన్నతులిస్తారు. దీంతో 5,789 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభిస్తాయి. ఇక 1,970 మంది ఎస్‌ఏలకు జీహెచ్ఎం పదోన్నతులు వస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పీఎస్హెచ్ఎంకు సంబంధించి 5,571 పోస్టులను అప్‌గ్రేడ్ చేసి పదోన్నతులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అవి వస్తే 5,571 మంది ఎస్జీటీలకు పదోన్నతులు వస్తాయి. హైకోర్టు అనుమతితో పండితులు, పీఈటీల అప్‌గ్రెడేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కోర్టులో ఉన్న ఆ కేసును వెకేట్ చేయిస్తే 8,630 భాషా పండితులు, 1,849 పీఈటీలు కలిపి 10,479 మందికి స్కూల్ అసిసెంట్లుగా పదోన్నతులు లభించే అవకాశమున్నది. అవన్నీ కలిపితే 23,809 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభిస్తాయి. ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్, డీఈవో పోస్టులకూ పదోన్నతులు వస్తే ఈ సంఖ్య మరింత పెరగనుంది.
స్వాగతించిన టీఎస్టీయూఎఫ్
విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పదోన్నతులకు గ్రీన్‌సిగల్ : పీఆర్టీయూటీఎస్
ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగల్ ఇచ్చిందని పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు తెలిపారు. 1998, 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాల కల్పన, ఎస్ఎస్ఏలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారని పేర్కొన్నారు.