Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యవేదిక హర్షం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు/లెక్చరర్ల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడం పట్ల కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీరణ ఐక్యవేదిక హర్షం ప్రకటించింది. ఈ మేరకు ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కొప్పిశెట్టి సురేష్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జీవోనెంబర్ 16 ప్రకారం రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు/లెక్చరర్ల క్రమబద్ధీరణ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు. ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం సేకరిస్తున్న నేపథ్యంలో క్రమబద్ధీకరణను ఆపాలనే దురుద్దేశంతో తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ పేరుతో ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఈ కేసులో క్రమబద్ధీకరణకు అనుకూలంగా కాంట్రాక్టు ఉద్యోగుల తరఫున తాము ఇంప్లీడ్ అయ్యామని వివరించారు. ఆ కేసును గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్రశర్మ బెంచ్ ముందుకు వచ్చిందని తెలిపారు. దాన్ని పరిశీలించి గతంలోనే ఈ కేసుపై చర్చ జరిగి క్రమబద్ధీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చామనీ, దీనిపై వాదనలు అవసరం లేదంటూ ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేశారని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు/లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.
ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం హర్షం
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీరణపై వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడం పట్ల ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకన్న, ప్రధాన కార్యదర్శి కుమార్ హర్షం ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారని గుర్తు చేశారు. ఆ నిర్ణయం అమలు కాకుండా చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా హైకోర్టు మరోసారి తీర్పుఇవ్వడాన్ని స్వాగతించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ చైర్మెన్ కనకచంద్రం కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని అడ్డంకులు వస్తున్నా వాటిని తొలగించేందుకు సహకరిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు ప్రకటించారు.