Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
- ఆ పరిస్థితి రాకూడదంటే వ్యాక్సిన్ తప్పనిసరి:
డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి మన రాష్ట్రంలో రాకూడదంటే, ప్రజలు ఫోర్త్ వేవ్ నుంచి తమను తాము కాపాడుకునేందుకు వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని స్పష్టం చేశారు. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కరోనా వ్యాప్తి పూర్తిగా పోలేదనీ, రానున్న మూడు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ''తెలంగాణలో పాజిటివిటీ రేటు పెరగలేదు. గత కొన్ని రోజులుగా రోజువారీగా హైదరాబాద్ మినహా మరెక్కడా 10కి పైగా కేసులు నమోదు కావడం లేదు. కొన్ని చోట్ల ఫోర్త్ వేవ్ ప్రారంభమైంది. థర్డ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. సీఎం గత నాలుగు రోజులుగా కోవిడ్ వివరాలు తెలుసు కుంటున్నారు. ఏప్రిల్, మే, జూన్ వరకు వివాహాలు, విహారయాత్రలు ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు నెలలు ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలు ప్రజలు పాటించాలి. పక్క రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ ఎక్స్ఈ వేరియంట్ ఎక్కువ ప్రభావం చూపకపోవచ్చు. 2022 డిసెంబర్ నాటికి కొవిడ్ పూర్తిగా ఫ్లూ లా మారే అవకాశం ఉంది. ఫోర్ట్ వేవ్‌పై అనేక అనుమానాలున్నాయి. సీరో సర్వే ప్రకారం రాష్ట్రంలో 93 శాతం మందిలో యాంటీబాడీలున్నాయి. దీంతో ఫోర్ట్ వేవ్ వస్తుందని కానీ లేదా రాదని క్షూడా చెప్పలేం. ఒకవేళ వస్తే దాని నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ తప్పనిసరి అని మాత్రం సూచిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో 106 శాతం జనాభాకు మొదటి డోసు ఇచ్చాం. రెండో డోసు కూడా వంద శాతం మంది వేసు కున్నారు. 60 ఏండ్లు పైబడిన వారికి అన్ని ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ కేంద్రాల్లో బూస్టర్ డోసు ఇస్తున్నాం. వయసుల వారీగా అర్హత ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవాలి. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తరువాత బూస్టర్ డోసు తీసుకోవాలి. ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ధరించకుంటే రూ.1,000 జరిమానా విధించాల్సి ఉంటుంది.'' అని డీహెచ్ వివరించారు.