Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బకాయిల చెల్లింపునకు తక్షణ ఆదేశాలు
- పనిప్రదేశంలో ఉపాధి కూలీ చనిపోతే
రూ.75 వేల తక్షణ సాయం: గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్పెషల్ కమిషనర్ ప్రసాద్ హామీ
- వ్యవసాయ కార్మిక సంఘాలు, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో కమిషనరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ - హిమాయత్‌నగర్
ఉపాధి హామీ కూలీలు పనిచేసే ప్రదేశాలకు గ్రామపంచాయతీ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్పెషల్ కమిషనర్ ప్రసాద్ హామీనిచ్చారు. పనిప్రదేశంలో ఉపాధి కూలీ చనిపోతే తక్షణ సాయం కింద రూ.75 వేలు చెల్లిస్తామనీ, పెండింగ్ బకాయి వేతనాలను చెల్లింపునకు తక్షణం ఆదేశాలు జారీచేస్తామని ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ఉపాధి కల్పన కమిషనరేట్ ఎదుట వ్యవసాయ కార్మిక, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూ ) రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ , రాష్ట్ర సహాయ కార్యదర్శి కందుకూరు జగన్, మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (బికెఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బాల మల్లేశ్, రాష్ట్ర అధ్యక్షులు కె కాంతయ్య, దళిత బహుజన ప్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్, డీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులికల్పన, తదితరులు పాల్గొన్నారు. ఆ సంఘాల ప్రతినిధులతో స్పెషల్ కమిషనర్ ప్రసాద్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గడ్డపార, తట్ట, పార, కొడవలి, గొడ్డలి వంటి పనిముట్లు, మెడికల్ కిట్లను అందించడంలో లోపం జరిగిన మాట వాస్తవమేనన్నారు. వాటి పంపిణీ విషయంపై ప్రభుత్వానికి రెఫర్ చేస్తామని హామీనిచ్చారు. పనిప్రదేశంలో నీడ కోసం టెంట్, చిన్న పిల్లల రక్షణ కల్పన బాధ్యత గ్రామ పంచాయతీలకు రూల్స్ ప్రకారం మార్చామని, వీటిని ఎంపీడీఓ పర్యవేక్షణ చేయాలన్నారు. నెలలో పదిహేను రోజులు పని ప్రదేశాల్లో విధిగా పర్యటనలు చేయాలని చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకునే ఆదేశాలు ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదన్నారు. ఫేస్లిప్లు ఇచ్చే పద్దతి ఆన్ లైన్ విధానం వల్ల సాధ్యం కాదన్నారు. అంతకుముందు ధర్నా నుద్దేశించి బి.ప్రసాద్, బాల మల్లేశ్, పి.శంకర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఏటేటా నిధులు తగ్గిస్తూ పోతున్నదని విమర్శించారు. 200 రోజులకు పనిదినాలను పెంచి పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మస్టర్ పద్దతి ద్వారా ఉదయం, సాయంత్రం పని ప్రదేశంలో ఫొటోలు అప్ లోడ్ పద్దతి అమలు చేస్తున్నదని విమర్శించారు. క్యూబిక్ మీటర్, కొలతలతో వేతనాలు ఇవ్వటం, వేసవి అలవెన్స్‌లు రద్దుచేయడంతో కూలీల వేతనాల్లో కోతపడుతున్నదని చెప్పారు. ఆన్లైన్ పేమెంట్ పేరుతో బ్యాంకు ఎకౌంట్, జాబ్ కార్డు నెంబర్లు లింకు అడుగుతున్నారనీ, కూలీలు ఇవన్నీ ఎలా చేయగలుగుతారని ప్రశ్నించారు. దీని వలన మారుమూల గ్రామాలల్లోని పేదలు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారని వాపోయారు. ఆన్ లైన్ చేసుకోవడానికి అవకాశం లేని వారు, బ్యాంకు అకౌంట్స్ లేని వారు పని చేసినా కూలీల వేతనాలు పొందే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనుల పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.