Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ మహబూబాబాద్
వార్డు కౌన్సిలర్ దారుణ హత్యతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గురువారం ఉదయం మహబూబాబాద్ పట్టణానికి చెందిన 8వ వార్డు కౌన్సిలర్, గిరిజన నేత బానోతు రవికుమార్(30)ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి, దాడిచేసి హత్య చేశారు. రవికుమార్ హత్యా ఘటనలో ఇద్దరు నిందితులను గుర్తించామని, ఆర్థిక లావాదేవీలే కారణమని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై మహబూబాబాద్ ఎస్పీ శరత్చంత్ర పవర్ మీడియాకు వివరాలు వెల్లడించారు మహబూబాబాద్ పట్టణంలోని బాబునాయక్తండాలో నివాసముంటున్న బానోతు రవికుమార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీలోని 8వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశాడు. టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. నాటి నుంచి నేటి వరకు మున్సిపాలిటీలో రెబల్ నేతగా ఎదిగాడు. ఈ క్రమంలో రెండేండ్లుగా ఆయనపై అనేక ఆరోపణలొచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెడికల్ కళాశాల భూముల విషయంలో గిరిజన ప్రజల పక్షాన ఉండి పోరాటం నిర్వహించారు. పలువురు రియల్ ఎస్టేట్, బెల్లం, కలప వ్యాపారులతో విభేదాలున్నాయి. మంగలి కాలనీలో కలప వ్యాపారం చేసే ఓ వ్యక్తికి, రవినాయక్కి మధ్య విభేదాలొచ్చాయని, భూ లావాదేవీల విషయంలోనూ విభేదాలున్నట్టు తెలసిందన్నారు. కలప వ్యాపారానికి చెందిన ట్రాక్టర్‌ను రవినాయక్ పోలీసులకు పట్టించాడని, దాంతో కక్ష పెంచుకొన్న సదరు వ్యాపారి రవిని అంతమొందించేందుకు వ్యాపారి తన మిత్రులతో కలిసి హత్య చేసినట్టు తెలిసిందన్నారు. మహబూబాబాద్‌లో మాలోత్ కవిత క్యాంపు కార్యాలయానికి వెళ్లే రోడ్డుకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేయగా రవికుమార్ పాల్గొని తిరిగి తన బైక్‌పై ఇంటికి వెళ్తుండగా పత్తిపాక కాలనీలో దుండగులు దారికాచి ట్రాక్టర్‌తో ఢకొీట్టారు.
వెనుక కారులో వచ్చిన మరో నలుగురు దుండగులు గొడ్డళ్లు, కత్తులతో రవినాయక్ మెడ, తల, గుండె మీద నరికి కిరాతంగా హతమార్చి పరారయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి రవిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవినాయక్ మృతిచెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనలో ఎంతటివారైనా సరే శిక్షిస్తామని ఎస్పీ తెలిపారు. ఏరియా ఆస్పత్రిలోనే మృతుని కుటుంబ సభ్యులను మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మెన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, కమిషనర్ లక్ష్మీ ప్రసన్న పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.