Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమాలకు పాల్పడిన కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
- బాధ్యులపైనా చర్యలు తీసుకోవాలి: సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కొన్ని ప్రయివేటు మెడికల్ కాలేజీలు పీజీ సీట్ల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఆయా కాలేజీల అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నీట్ కౌన్సెలింగ్‌లో యాజమాన్య కోటా సీట్లు మిగిలాయనీ, ఒక్కో ఎన్ఆర్ఐ సీటును సుమారు రూ.రెండు కోట్లకుపైగా అక్రమంగా కాలేజీలు అమ్ముకుంటున్నాయని విమర్శించారు. ఈ అక్రమ వ్యాపారం వల్ల రాష్ట్రంలో అర్హులైన పేద, మధ్య తరగతి విద్యార్థులకు సీట్లు రాక తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. అయినా వర్సిటీ తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాలంటే ఒక రాష్ట్రంలో సీటు పొందిన విద్యార్థికి మరో రాష్ట్రంలో అడ్మిషన్‌ను బ్లాక్ చేసేందుకు చెక్ పెట్టే చర్యలు తీసుకోవాలని సూచించారు. సీటు సాధించిన విద్యార్థి చివరి విడత కౌన్సెలింగ్ వరకు రిపోర్టు చేయకపోయినా, సీటు రద్దు చేసుకున్నా మిగిలిపోయిన సీట్లకు యూనివర్సిటీ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి ఆ సీట్లను భర్తీ చేయాలని కోరారు. తద్వారా అవినీతికి తావు లేకుండా చూడాలని తెలిపారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో స్పెషలైజేషన్ పీజీ సీట్ల భర్తీలో జరుగుతున్న అవినీతి, అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన మెడికల్ కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని కోరారు. ఈ దుశ్చర్యకు పాల్పడుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.