Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిషన్‌రెడ్డికి రేవంత్ వత్తాసు
- తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్
- విలేకర్ల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం... రాష్ట్రంలోని రైస్ మిల్లర్లను వేధింపులకు గురి చేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా రైతుల నుంచి ధాన్యం కొనకుండా వారిపై ఒత్తిడి తెస్తున్నదని చెప్పారు. ఈ అంశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, ఎల్.రమణతో కలిసి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. గురువారం వరంగల్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి...తెలంగాణను అవహేళన చేస్తూ మాట్లాడారని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైందనీ, మొన్నటి ఉత్తర ప్రదేశ్ ఎన్నికలతో దాని సత్తా తేలిపోయిందని ఎద్దేవా చేశారు. వాస్తవానికి తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు లాంటి పథకం అమలవుతున్నదా..? అని ప్రశ్నించారు. ఇలాంటి వాస్తవాలను మరిచి రైతు సంఘర్షణ పేరిట సభను ఎలా నిర్వహించబోతున్నారని ప్రశ్నించారు. పల్లా మాట్లాడుతూ... రైతుల నుంచి ధాన్యం సేకరించకుండా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ ఆయన... ఇలాంటి చర్యలతో రైతు వ్యతిరేకిగా మరింత అప్రదిష్ట పాలవుతారని హెచ్చరించారు. పీసీసీ చీఫ్ రేవంత్ ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.