Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ సంఘ్లీ మెస్సభలో 11మందితో సెంట్రల్ కమిటీ : దాసు సురేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీలకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం అన్ని ప్రాంతాల బీసీలు సమిష్టి కృషితో పోరాటం చేయాలనీ, ఆ దిశగా ప్రణాళికలను సిద్ధం చేశామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ ప్రకటించారు. శుక్రవారం న్యూఢిల్లీ సెంట్రల్ ఓబీసీ కమిటీ ఆధ్వర్యంలో ప్రకాష్ వర్మ నేతృత్వంలో జ్యోతిభాఫూలే మార్గ్‌లోని సంఘ్లి మెస్ కాలనీలో ఓబీసీ హక్కుల సాధన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీసీల తలరాతలు మారాలంటే పార్లమెంట్, అసెంబ్లీలలో ఉండాలన్నారు. దేశ జనాభాలో 60శాతం ఉన్న బీసీలపై కేంద్ర ప్రభుత్వానికి చిన్న చూపెందుకని ప్రశ్నించారు. విద్య, ఉద్యోగ,వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ రంగాల రిజర్వేషన్లలో ఓబీసీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లు కోసం ప్రభుత్వాలు, పార్టీలు తమ నిబద్దతను చాటాలని కోరారు. భవిష్యత్తులో ఢిల్లీ కేంద్రంగా పోరాటాలు నిర్వహించేందుకుగానూ 11మందితో కూడిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. కన్వీనర్‌గా ప్రకాష్ వర్మ, జనరల్ సెక్రటరీగా కుప్పు స్వామి, మహిళా కన్వీనర్‌గా పుష్ప వర్మ, మహిళా కో కన్వీనర్ గా హేమలత మెస్సీ, సెక్రటరీగా ఛాయా దేవి, విద్యార్థి సంఘం అధ్యక్షులుగా రజత్ కుమార్, యూత్ అధ్యక్షులుగా దీపక్ శ్రావణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఆర్తి, ఉష, అజరు, రీతూలు ఉంటారని తెలిపారు.