Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్ల వరకు ఆహార నిల్వలుండాలి
- ధాన్యం అన్‌లోడింగ్‌కు మిల్లర్ల అంగీకారం
- మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శ్రీలంక వంటి సంక్షోభం భారత్‌లో వస్తే ఇతర దేశాలు ఆదుకోబోవని మంత్రి గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఆహార భద్రత చట్టాన్ని నీరుగార్చొద్దని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సూచించారు. కనీసం మూడేండ్ల వరకు ఆహార నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర మిల్లర్ల అసోసియేషన్, మిల్లర్లతో ప్రభుత్వం శుక్రవారం హైదరాబాద్‌లో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ధాన్యం అన్‌లోడింగ్‌కు మిల్లర్లు అంగీకరించారని మంత్రి గంగుల కమలాకర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కేంద్రం నిరాకరించినా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల తరఫున ధాన్యం కొనుగోలు చేస్తున్నారని వివరించారు. యాసంగి ధాన్యం సేకరణలో మిల్లర్లు భాగస్వామ్యం కావాలని కోరారు. రైతులకు, మిల్లులు సంబంధం ఉండొద్దని సూచించారు. ఒక్క కిలో తరుగు పెట్టడానికి వీల్లేదని తెలిపారు. మిల్లర్ల ప్రతిపాదనలు సీఎస్ కమిటీకి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిం చాలని మిల్లర్లు కోరారని వివరించారు. వారిని దొంగలు గా చూడడం బాధేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సహకరిస్తామనీ, లాభాలు రాకున్నా నష్టం లేకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని తెలిపారు. మద్దతు ధరతో రైతాంగం పండించిన పంటను చివరి గింజ వరకు సేకరించాలని నిర్ణయించామని పేర్కొ న్నారు. ఈ నేపథ్యంలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారం భించామని గుర్తు చేశారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని మిల్లర్లకు సూచిం చారు. మిల్లర్‌కు, రైతుకు సంబంధం ఎందుకనీ, కొను గోలు కేంద్రాల్లోనే నాణ్యతా ప్రమాణాలు పాటించి మిల్లు కు ధాన్యం పంపుతామని వివరించారు. ఒక్క కిలోను మిల్లుల్లో కోత పెట్టొద్దని కోరారు. ఎఫ్‌సీఐ ఏర్పడినప్పటి నుంచి అనుసరిస్తున్న విధానాలను కాలదన్ని కేంద్రం రైతులతో వ్యాపారం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. వ్యవసాయాన్ని వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతగా చూడాలని కోరారు. ఆదాయమే కావాలంటే జీఎస్టీ, ఆదాయపు పన్ను వంటి వాటిలో చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యమ్రంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, పౌరసరఫరాల సంస్థ జీఎంలు, ఉన్నతాధికారులతోపాటు, మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.