Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ ఆరోపణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహబూబాబాద్‌లో కౌన్సిలర్ బానోతు రవి హత్యలో స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్ హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్, ఎస్సీ, ఎస్టీ విభాగల చైర్మెన్లు ప్రీతమ్, జగన్‌లాల్‌నాయక్, అధికార ప్రతినిధి సుధీర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించిపోయాయని చెప్పారు. రోడ్ల మీదనే మనుషులను నరిసికివేసే దుస్థితి కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కౌన్సిలర్ బానోతు రవిని ట్రాక్టర్‌తో గుద్దించి గొడ్డళ్లతో నరికి చంపారని చెప్పారు. మెడికల్ కాలేజీ భూనిర్వాసితులకు మద్దతుగా పోరాడుతున్న ఆయనను... గత రెండు నెలలుగా ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని చెప్పారు. పాత కక్షలతోనే రవి హత్య జరిగినట్టు విచారణ జరపకుండానే ఎస్పీ స్టేట్మెంటు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తున్నదని చెప్పారు. ఎమ్మెల్యేలు చెబితే గానీ సీఐలు ఎఫ్ఐఆర్ చేయని దుస్థితి ఏర్పడిందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలు చేస్తున్నదని విమర్శించారు. పార్టీ నేతల కనుసన్నుల్లో హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.
జానారెడ్డిని సన్మానించిన రేవంత్
కాంగ్రెస్ చేరికల కమిటీ చైర్మెన్‌గా నియమితులైన కె జానారెడ్డిని పీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి సన్మానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జానారెడ్డి నివాసానికి వెళ్లి రేవంత్ ఆయనన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి తదితరులున్నారు. అనంతరం శాలువా కప్పి ఆయనను సన్మానించారు. అనంతరం ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా కలిసి జానారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.