Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుణమాఫీ చేయాలి..కౌలురైతులకు రక్షణ కల్పించాలి
- సీఎం కేసీఆర్కు బండి సంజయ్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు వెంటనే అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ డిమాండ్ చేశారు. రైతురుణమాఫీ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలనీ, వారికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది కౌలురైతులకు రక్షణ లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కౌలు రైతులు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ది కూడా నోచుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. భూ యజమానుల హక్కులకు భంగం వాటిల్లకుండా రాష్ట్రాలు కౌలుచట్టాల్లో మార్పులు చేసుకోవాలంటూ 11వ పంచవర్ష ప్రణాళిక పేర్కొందని తెలిపారు. కౌలు చట్ట సవరణ అంటే భూయజమానికి, కౌలుదారులకు భరోసా కల్పించేవిధంగా సవరణలు ఉండాలని ఆ నివేదికలో స్పష్టం చేసిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలుదారులకు హక్కులు కల్పించకపోగా వారిని కనీసం రైతులుగా గుర్తించడానికి కూడా నిరాకరించడం గర్హనీయమని పేర్కొన్నారు. పావలా వడ్డీ రుణాలు కౌలుదారులకు ఇవ్వొచ్చని నాబార్డు సూచించినా రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు.