Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యాహ్న భోజనంపై స్పష్టత ఇవ్వాలి
- మంత్రి సబితకు టీఎస్‌జీహెచ్‌ఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి విద్యార్థులకు వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో వివిధ ఉన్నత పాఠశాలల్లో డిప్యూటేషన్‌పై నియమించిన సబ్జెక్టు టీచర్లను కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీఎస్‌జీహెచ్‌ఎంఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి మెయిల్, వాట్సాప్ ద్వారా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజగంగారెడ్డి, కోశాధికారి బి తుకారం వినతిపత్రం పంపించారు. విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్న భోజనంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈనెల 25వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు ఒక సెక్షన్‌కు ఒక టీచర్ చొప్పున పాఠశాలకు హాజరై ప్రత్యేక తరగతులు నిర్వహించాలంటూ ఎస్సీఈఆర్టీ ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల ఖాళీల్లో డిప్యూటేషన్‌పై టీచర్లను నియమించారని తెలిపారు. వారంతా విద్యాసంవత్సరం చివరి పనిదినం శనివారం సొంత పాఠశాలల్లో తిరిగి చేరాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రత్యేక తరగతుల దృష్ట్యా వారిని కొనసాగించాలని కోరారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి సాంకేతికంగా ఏమైనా అవరోధాలుంటే కనీసం అల్పాహారమైనా అందించాలని సూచించారు.