Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజిల్ సాకుతో హార్వెస్టర్ యజమానుల ఇష్టారాజ్యం
- ఆరు నెలల్లో గంటకు రూ.400 పెంపు
నవతెలంగాణ-మల్హర్రావు
రాష్ట్ర ప్రభుత్వమే వరిధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టత ఇవ్వడంతో పల్లెల్లో హార్వెస్టర్ యజమానుల దోపిడీ షురూ ఆయింది. డీజిల్ ధర పెరిగిపోయిందనే సాకుతో ఇష్టారీతిగా ధరలతో రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలు కాగా రైతులు సదరు పనుల్లో నిమగమయ్యారు. గత యాసంగిలో అకాల వర్షాలు వెంటాడగా ముందస్తుగా వీలైనంత త్వరగా కోతలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హార్వెస్టర్లకు భారీగా గిరాకీ పెరిగింది. దాంతో వారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. జయశంకర్-భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం పదిహేను గ్రామాల్లో 2,356 ఎకరాల్లో వరి సాగు చేశారు. 40 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరి కోతలు ప్రారంభం కాగా హార్వెస్టర్ యంత్రాలు గ్రామాల్లోకి చేరుతున్నాయి. కొందరు ఇతర జిల్లాల నుంచి మిషన్లను అద్దెపై తెస్తుండగా మరి కొందరు కొత్తగా కొనుగోలు చేశారు. కాగా గతంలో ఎకరం లెక్కన కోత కోయగా, రెండేండ్ల నుంచి గంటల చొప్పున కొస్తూ చార్జీ వసూలు చేస్తున్నారు. గత యాసంగిలో గంటకు రూ.1500 తీసుకోగా ప్రస్తుతం రూ.1900 నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారు. హార్వెస్ట్టర్తో ఎకరం కోయాలంటే రెండు గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ఎకరం లెక్కన అదనంగా వసూలు చేస్తున్న మొత్తం మండలవ్యాప్తంగా దాదాపు రూ.8.50 లక్షల భారం రైతులపై పడుతోంది. ఇక మొగులు కమ్మినా, అకాల వర్షాలు కురిసినా భారీ మొత్తంలో హార్వెస్టర్ చార్జీలు వసూలు చేస్తారని పలువురు పేర్కొంటున్నారు. గత యాసంగిలో డీజిల్ ధర లీటర్కు రూ.90.12 ఉండగా, ప్రస్తుతం రూ.105.63 ఉంది. అప్పటికి ఇప్పటికి రూ.15 పెరగగా వందల రూపాయల్లో చార్జీలు పెంచడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ధరకు అదనంగా రూ.100 వసూలు చేస్తే హార్వెస్టర్ యజమానులకు గిట్టుబాటు అవుతుంది. కానీ, అవసరాన్ని ఆసరా చేసుకుని అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇకపై అద్దెపై తీసుకొచ్చిన వారు బత్త, ఇతర ఖర్చుల పేరిట అదనంగా దోచుకుంటున్నారు. సమస్య తీవ్రస్థాయికి చేరకముందే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని రైతులకు, హార్వెస్టర్ యజమానులకు గిట్టుబాటు ధర నిర్ణయించాల్సిన అవసరం ఉందని మండల రైతులు కోరుతున్నారు.
నియంత్రణ ఉంటేనే ప్రయోజనం : పైడింత రాజు, రైతు
హార్వెస్టర్ యజమానులు ఒక్క తీరైతే, అద్దెకు తెచ్చుకున్నవారు మరో రకంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పెరిగిన డీజిల్ ధర వారికి అయ్యే ఖర్చు అన్నింటినీ బేరీజు వేసి ధరను నిర్ణయించాలి. అట్లైతేనే రైతులకు మేలు జరుగుతుంది.