Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు కాలేజీలో మిగిలిన సీట్లు 58
- మెడికల్ పీజీ సీట్లకు మరోరౌండ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తాం:
- మీడియా సమావేశంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఒక్క మెడికల్ పీజీ సీటును కూడా బ్లాక్ కానివ్వబోమని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. మాప్‌అప్ రౌండ్ తర్వాత ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో 58 సీట్లను విద్యార్థులు వదిలేశారనీ, వాటన్నింటినీ గుర్తించామని తెలిపారు. వాటి భర్తీ కోసం మరో విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తామని హామీనిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) శ్రీనివాసరావు, వైద్యవిద్యా సంచాలకులు (డీఎంఈ) రమేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్లకు రిజర్వేషన్లు ఉండవని చెప్పారు. ఏ రాష్ట్ర విద్యార్థి అయినా నీట్ ర్యాంకు ఆధారంగా సీట్లను పొందొచ్చునన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల వారూ ఇక్కడ కౌన్సిలింగ్లో పాల్గొంటున్నారనీ, ఈ క్రమంలోనే సీటు బ్లాకింగ్ దందా జరుగుతోందని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అనుమానిత విద్యార్థులకు బ్లాక్ దందాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనే లేఖ రాశామన్నారు. రెండో విడతలో ఇతర రాష్ట్రాలకు చెందిన 14 మంది మెరిట్ విద్యార్థులకు తెలంగాణలో సీట్లు వచ్చాయనీ, వారు చేరకుండా వెళ్లిపోయారని తెలిపారు. ఆ తర్వాత రౌండ్లో మరో 20 మందికి సీట్లు కేటాయించగా..అందులో 16 మంది అడ్మిషన్ తీసుకోలేదన్నారు. బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్టు గుర్తించామన్నారు. వారికి లెటర్లు రాయగా ఐదుగురు మాత్రం తాము దరఖాస్తు చేయకుండానే సీటు కేటాయింపు జరిగిందని సమాధానం పంపారని తెలిపారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గడువు ముగిసిన తర్వాత కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కోసం అనుమతి కావాలని ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు విద్యార్థుల పేరుతో కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పారు. వారిలో ఇద్దర్ని సంప్రదిస్తే అందులో ఇద్దరు అసలు తాము కోర్టుకే వెళ్లలేదని చెప్పారని వెల్లడించారు. ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లామనీ, ఆయన సూచనతోనే ఆ వివరాలను పోలీసులకు అందజేశామని తెలిపారు. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అడ్వైజరీకి విరుద్ధంగా మన రాష్ట్ర విద్యార్థుల్లో కొంత మంది సెకండ్ రౌండ్లో వచ్చిన సీట్లను వదిలేసి ఆలిండియా మాప్‌అప్ రౌండ్ కోసం వెళ్లారని వివరించారు. సుప్రీం కోర్టు ఆల్ఇండియా మాప్ అప్ రౌండ్‌ని రద్దు చేసిన నేపథ్యంలో వాళ్లకు రెండో రౌండ్లో వచ్చిన సీట్లను వెనక్కి ఇవ్వాలని ఎంసీఐ సూచించిందని తెలిపారు.
అలా చేయడం కుదరదనీ, కొంత మంది కోసం, వందలాది మంది విద్యార్థులను ఇబ్బంది పెట్టలేమని స్పష్టం చేశామన్నారు. సీట్లు వదిలేసి వెళ్లిన విద్యార్థులకు మళ్లీ నిర్వహించబోయే కౌన్సిలింగ్లో అనుమతి ఇస్తామని హామీనిచ్చారు. సీటు బ్లాకింగ్ దందాను అరికట్టాలంటే దేశవ్యాప్తంగా ఒకే వెబ్సైట్ ఉండాలనీ, అందులో అన్ని రాష్ట్రాల కౌన్సిలింగ్ వివరాలను అప్లోడ్ చేస్తే బాగుటుందని సూచించారు. ఇలా చేయడం వల్ల ఏయే విద్యార్థికి ఎక్కడ ఎక్కడ సీటు వచ్చిందో సులువుగా తెలుసుకోవచ్చునన్నారు. ఎవరైనా సీటు బ్లాకింగ్‌కు పాల్పడితే దీనివల్ల సులువుగా పట్టుకోవచ్చునని తెలిపారు.