Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరిసిల్ల జిల్లాకు మరో 61లక్షల బ్యాగుల అవసరం
- జిల్లాలో లక్ష 18వేల 893 ఎకరాల్లో వరి సాగు
- రెండు లక్షల 97వేల 232 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
- జిల్లావ్యాప్తంగా 265 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
యాసంగి ధాన్యం కల్లాల నుంచి మార్కెట్లకు చేరుతోంది.. కొనుగోళ్లూ ప్రారంభమవుతున్నాయి. మొదట్లో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో కొందరు రైతులు తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నా.. ఎప్పటిలాగే గన్నీ సంచుల కొరత వెంటాడుతోంది. ప్రతి సీజన్లోనూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే నెలరోజుల ముందు నుంచే జిల్లా యంత్రాంగం పౌరసరఫరాల సంస్థ నుంచి గన్నీ బ్యాగులను సమకూర్చుకుంటుంది. కానీ ఈసారి ప్రభుత్వం ఆలస్యంగా తేరుకోవడంతో సరిపడా సంచులు అందుబాటులో లేవు. వడ్ల కొనుగోళ్లు ప్రారంభించినా గన్నీ సంచుల కొరతతో లోడింగ్, అన్లోడింగ్కు ఇబ్బందులు తప్పేలా లేవు. యాసంగిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో లక్షా 18వేల 893 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. రెండు లక్షల 97 వేల 232 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీనికి అనుకనుగుణంగా ఐకేపీ ద్వారా 66, ఫ్యాక్స్ సొసైటీల ఆధ్వర్యంలో185, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 9, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 2, మెప్మా ఆధ్వర్యంలో 3 కొనుగోలు కేంద్రాలు.. మొత్తం జిల్లా వ్యాప్తంగా 265 కొనుగోలు కేంద్రాలను ఈనెల 25న ప్రారంభించనున్నారు. ఆయా కేంద్రాల్లో 2లక్షల 97 వేల 232 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశముంది. ఇందుకోసం గన్నీ బ్యాగులు 12 లక్షల46 వేలు మాత్రమే జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. మే నెలలో ధాన్యం దిగుబడి అధికంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఏప్రిల్లో కోతలు మొదలయ్యాయి. కేంద్రాల్లోకి ధాన్యం అధికంగా వస్తే గన్నీ బ్యాగులు లేకుంటే ఎగుమతి కష్టతరంగా మారుతుంది. ఈ క్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు మిల్లర్ల ద్వారా గన్నీ బ్యాగులు సేకరించి జిల్లాలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ బ్యాగులు ఇప్పటికే ఒకసారి ఉపయోగించినవి కావడంతో అందులో దెబ్బతిన్న బ్యాగులను మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఎప్పటికి గన్నీ బ్యాగులు అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత లేదు.
నాణ్యత ప్రమాణాల పేరిట.. ఇబ్బందులు
రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.1960 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. గతంలో పలుమార్లు ధాన్యం కొనుగోలులో తరుగు, తేమ, ఇతర నాణ్యత ప్రమాణాల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేశారు. ఈసారీ అలాంటి సమస్య ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇటీవల మిల్లర్లు ధాన్యం సేకరణ విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేసినా అధికారులు పట్టించుకోలేదు. కొనుగోళ్ల సమయంలో స్పెషల్ టాస్క్ఫోర్స్ టీం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులతోపాటు తేమ యంత్రాలు, తూకం యంత్రాలు, టార్ఫాలిన్లు అందుబాటులో ఉండాలి.
ప్రణాళిక సిద్ధం చేశాం..
ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. జిల్లాలో ధాన్యం దిగుబడి అంచనాకు అనుగుణంగా 265 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటి వరకు 14లక్షల 45 వేల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మరో 61లక్షల గన్ని సంచులు అవసరం అవుతాయని ప్రభుత్వానికి నివేదిక పంపించాం.
- జితేందర్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి- సిరిసిల్ల
టెండర్ల ఆలస్యంతో సమస్యలు..
గన్నీ బ్యాగులకు రాష్ట్రస్థాయిలోనే పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో టెండర్లను పిలుస్తుంది. ఈసారి టెండర్లు కూడా ఆలస్యం అయ్యాయి. జిల్లాకు ప్రస్తుతం మరో 61లక్షల సంచులు అవసరం ఉన్నాయని ప్రతిపాదనలు పంపారు. అందుబాటులో ఉండే 14 లక్షల45వేల గన్నీ బ్యాగులు వస్తే కొంతమేర సమస్య తీరే అవకాశముంది. కానీ టెండర్లు ఆలస్యం కావడంతో అవి ఎప్పటికి సరఫరా అవుతాయనేది స్పష్టత లేదు. సంచికి రూ.28 వెచ్చించి రాష్ట్ర స్థాయిలో కొనుగోలు చేస్తున్నారు. సీజన్ ముందే అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి.