Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితుని అరెస్ట్... తప్పిన ప్రాణాపాయం
- అతడ్ని కఠినంగా శిక్షించాలి : ప్రజాసంఘాలు
నవతెలంగాణ-మట్టెవాడ
ప్రేమిస్తున్నానని వెంటపడినా ప్రేమించకపోవడంతో కత్తితో యువతి గొంతు కోసిన ఘటన హనుమకొండ జిల్లాలో కలకలం రేపింది. కాగా, ఘటన జరిగిన 24 గంటలలోపలే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లికి చెందిన అనూష(23) కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ చివరి సంవత్సరం చదువుతుంది. కాగా, సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన అజార్.. ప్రేమ పేరుతో అనూషను వెంటపడేవాడు. అతని ప్రేమను ఆమె నిరాకరించింది. కాగా, సాప్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడానికి హైదరాబాద్ వెళ్లిన ఆమె శుక్రవారం ఉదయం హనుమకొండకు వచ్చింది. అనూష వచ్చిందన్న విషయం తెలుసుకున్న అజార్.. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకొని.. ఆమె ఇంటికి వెళ్లి ప్రేమించాలని వేధించాడు. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో.. అజార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి పారిపోయాడు. యువతి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు రక్తపుమడుగులో ఉన్న ఆమెను వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక వైద్యులను అందుబాటులో ఉంచుతూ 48 గంటలు ఆర్ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచామని తెలిపారు. కాగా, సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న వరంగల్ సీపీ తరుణ్ జోషి ఆదేశాలతో నిందితుడిని పట్టుకోవడానికి సుబేదారి సీఐ రాఘవేందర్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసులు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుడు అజార్ ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసి హనుమకొండ సిటీ దాటే ప్రయత్నంలో ఉన్న అతన్ని పట్టుకున్నారు. బాధితురాలు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి - ప్రజాసంఘాల డిమాండ్
అనూషపై దాడి విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు, వర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. ఆడవాళ్ళపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో పాలకులు విఫలమయ్యారని, అందుకే అనునిత్యం ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు విమర్శించారు. ఆస్పత్రి ఆవరణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదుపులోకి తీసుకున్న నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
గవర్నర్ తమిళిసై విచారం
వరంగల్లో ప్రేమోన్మాది దాడి ఘటనపై రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం విచారం వ్యక్తం చేశారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి. యువతి ఆరోగ్య పరిస్థితిపై ఆమె ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావతంకాకుండా చూడాలని కోరారు.