Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు టీఎస్పీఎస్సీ పాలకమండలి కీలక సమావేశం
- నోటిఫికేషన్ విడుదలపైనే ప్రధాన చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అందరిచూపు గ్రూప్-1పైనే పడింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గ్రూప్-1కు సంబంధించి తొలి నోటిఫికేషన్ ఇదే కావడం గమనార్హం. దీంతో ఆ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందా?అని అభ్యర్థులంతా ఎదురుచూస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం లేదా సోమవారం గ్రూప్-1 నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికోసం అవసరమైన ప్రక్రియ అంతా సిద్ధమైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పాలకమండలి కీలక సమావేశం శనివారం జరగనుంది. దీంతో ఈ సమావేశానికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. గ్రూప్-1 నోటిఫికేషన్, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశమున్నది. దీంతో నోటిఫికేషన్ విడుదలవుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 12 శాఖల నుంచి 19 రకాల పోస్టులు భర్తీ కానున్నాయి. 80,039 కొలువులను భర్తీ చేస్తామంటూ ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రటించిన సంగతి విదితమే. ఇప్పటికే ఆర్థిక శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేస్తున్నది. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు ఇంటర్వ్యూలను ప్రభుత్వం ఎత్తివేసింది. రాతపరీక్ష ఆధారంగానే ఆయా పోస్టులకు అభ్యర్థులను పారదర్శకంగా ఎంపిక చేయాలని నిర్ణయించింది. దీంతో సివిల్స్ రాసే అభ్యర్థులు మొదలుకొని గ్రూప్-1, గ్రూప్-2 రాసే వారంతా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.