Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చర్చలకు తేదీని ప్రకటించాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం (ఎస్సీకేఎస్-సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మధు డిమాండ్ చేశారు. గురువారం ఆన్లైన్లో ఎస్సీకేఎస్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఇచ్చిన నోటీస్‌పై ఫిబ్రవరి తొమ్మిదోతేదీన హైదరాబాద్‌లోని సెంట్రల్ లేబర్ కార్యాలయంలో అధికారుల సమక్షంలో చర్చలు జరిగాయన్నారు. అందులో రాష్ట్ర ప్రభుత్వ పీఆర్సీకనుగుణంగా 30 శాతం వేతనాలు పెంచడానికి సింగరేణి అధికారులు అంగీకరించారనీ, మరికొన్ని సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారని గుర్తుచేశారు. మరింత అధ్యయనం చేయడానికి యాజమాన్యం గడువు కోరగా 19న చర్చలుంటాయని సెంట్రల్ లేబర్ అధికారులు చెప్పారన్నారు. యాజమాన్యం మాత్రం కావాలని తాత్సారం చేస్తూ చర్చలు జరగకుండా వాయిదా వేయించిందని విమర్శించారు. ఇది కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేయడమేనన్నారు. వెంటనే తేదీని ప్రకటించి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామనీ, జరగబోయే పరిణామాలకు సింగరేణి యాజమాన్యం, సెంట్రల్ లేబర్ అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఇతర కాంట్రాక్టు కార్మిక సంఘాలన్నీ ఐక్య పోరాటాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్లు వేల్పుల కుమారస్వామి, ఉపేందర్, అరవింద్, దూలం శ్రీనివాస్, అంబాల ఓదేలు, రేపాకుల శ్రీనివాస్, కె. రాజయ్య, బందు సాయిలు, మహేందర్, గద్దల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.