Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల్ని అవమానిస్తున్న యాజమాన్యం
- పోరాటాల ద్వారానే వేజ్‌బోర్డు సాధించుకోవాలి : కార్మిక సంఘాలు
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి
బొగ్గుగని కార్మికుల 11వ వేతన కమిటీ సమావేశం ఎలాంటి ఒప్పందం జరగకుండానే వాయిదా పడింది. బొగ్గు గని కార్మికుల వేతన స్థిరీకరణపై శుక్రవారం కోల్ ఇండియా యాజమాన్యానికి, జాతీయ కార్మిక సంఘాలకు మధ్య కోల్‌కతాలో జరిగిన చర్చల్లో ఎలాంటి అంగీకారం కుదరలేదు. కార్మిక సంఘాలు కనీస వేతన పెరుగుదల 50శాతం ఉండాలని కోరుతున్నాయి. యాజమాన్యం మాత్రం మూడు శాతమే ఇవ్వడానికి కార్మిక సంఘాల ముందు ప్రతిపాదించింది. దీనిపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గతంలో వేతన పెరుగుదల 41శాతం వరకు ఉన్నదని నేతలు గుర్తు చేశారు. ప్రస్తుతం మూడు శాతం మాత్రమే వేతనాలు పెంచుతామన్న యాజమాన్యం ప్రతి పాదన బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధా నాలకు నిదర్శనమని కార్మిక నాయకులు విమర్శిం చారు. జేబీసీసీఐ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే మొక్కుబడిగా నిర్వహించారని ఆరోపించారు.
వేతన సవరణ ఒప్పందాన్ని జాప్యం చేయడానికి కోల్ ఇండియా యాజమాన్యం ప్రయత్నిస్తున్నదని కార్మిక సంఘాల నేతలు అన్నారు. కోల్ ఇండియా అనుబంధంగా ఉన్న సీఎం పీడీఐఈఎల్ను విడదీసి ఎంఈసీఎల్‌లో కలపడానికి యాజమాన్యం చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. జూన్ నెలలో తిరిగి సమావేశం జరుపుతామని యాజమాన్యం ప్రకటించింది. కోల్ ఇండియా చైర్మెన్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్మిక నాయకులు డిడి రామా నందం, మంద నరసింహారావు (సీఐటీయూ), వి.సీతారామయ్య(ఏఐటీయూసీి), రియాజ్ అహ్మద్ (హెచ్ఎంఎస్), సింగరేణి డైరెక్టర్ 'పా' బలరాం, జీఎం పర్సనల్ ఆనందరావు పాల్గొన్నారు.
పోరాటాలకు సిద్ధం కండి..
కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధా నాలు అవలంబిస్తోందని సీఐటీయూ వేజ్ బోర్డు సభ్యుడు నరసింహారావు అన్నారు. మెరుగైన ఒప్పందం జరగాలంటే కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాబోవు కాలంలో బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి తీరుతామని హెచ్చరించారు.