Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయంతి కార్యక్రమంలో పోటు రంగారావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రష్యాలో విప్లవాన్ని విజయవంతం చేసి, సోషలిజాన్ని నిర్మించిన మహనీయుడు లెనిన్ అని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. శుక్రవారం లెనిన్ 153వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని మార్క్స్భవన్లో ఆయన ఎర్రజెండాను ఎగరేశారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ వెనుకబడిన రష్యాలో కార్మికవర్గాన్ని ఐక్యం చేసి ప్రపంచంలోనే ప్రప్రథమంగా సోషలిజాన్ని నిర్మించారని చెప్పారు. దాని ద్వారా దశాబ్ధ కాలంలో ప్రపంచంలోనే ఆ దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దారని వివరించారు. విశ్వంలోనే మొదటి సమసమాజాన్ని నిర్మించి ప్రజల కష్టాల్ని దూరం చేశారని అన్నారు. మార్క్సిజాన్ని సరిగ్గా అన్వయించిన ఘనత లెనిన్దేనని చెప్పారు. శాస్త్రీయ వైఖరితో ప్రజాపంథా ఆవిర్భవించిందని గుర్తు చేశారు. మార్క్సిజాన్ని సృజనాత్మకంగా అన్వయించి ఈ దేశానికి విముక్తి సాధించాలని అన్నారు. ఇప్పటిదాకా పిడివాదంతో, జడాత్మకంగా మిగిలిపోయామన్నారు. ఇప్పటికైనా కార్మికవర్గ వెల్లువలు సృష్టించాలని చెప్పారు. ప్రజాపంథా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం హన్మేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కెజి రాంచందర్, కె రమ, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం, రాష్ట్ర నాయకులు ఎస్ఎల్ పద్మ, వి కిరణ్, నాయకులు నల్లన్న, అఫ్జల్, రవి, లింగంగౌడ్, ప్రభాకర్, పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రదీప్, పీడీఎస్యూ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ నాగేశ్వరరావు, బి రాము, నాయకులు స్వాతి, పీవోడబ్ల్యూ నాయకులు వరలక్ష్మి, స్వరూప, పుష్ప, దేవమణి తదితరులు పాల్గొన్నారు.