Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం ఫ్లోర్‌పై ప్రత్యేక దృష్టి
- 1.85 లక్షల ఎస్ఎఫ్టీ విస్తీర్ణం
- కార్పెట్ ఏరియా 53 వేల ఎసీఎఫ్టీ
- శరవేగంగా పనులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కొత్త సచివాలయం పనులు టాప్‌గేర్‌లో నడుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నతాధికారులు అడుగులేస్తున్నారు. ప్రణాళిక, డిజైన్లు, నిధులు, నిర్మాణ పనుల విషయంలో ఎక్కడా రాజీపడకుండా చురుగ్గా పనులు సాగుతున్నాయి. వచ్చే దసరా నాటికి కొత్త సచివాలయం పూర్తి చేయాలని వర్కింగ్ ఏజెన్సీ షాపూర్జీ పల్లోంజీ సంస్థను సర్కారు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన సచివాలయం పనులు మూడు షిఫ్టుల్లో శరవేగంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా రోడ్లు, భవనాల శాఖ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు కాంట్రాక్టు సంస్థకు అందుబాటులో ఉంటూ పనులు చేయిస్తున్నది. ఉన్నతాధికారులు, మంత్రులు, సీఎం పలుమార్లు సచివాలయ పనులు తనిఖీ చేసిన సంగతి విదితమే. పనుల్లో ఎలాంటి లోపాలు జరగకుండా అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నది.
కొత్త సచివాలయంలోని ఆరో ఫ్లోర్లో సీఎం కార్యాలయ నిర్మాణంపై రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ సీఎం ఆఫీసును దసరాలోపు అన్ని హంగులతో పూర్తిచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా, కొత్త సచివాలయంలో కేవలం సీఎం కార్యాలయం మాత్రమే అత్యధిక విస్తీర్ణం కలిగి ఉంది. ఆరో అంతస్థులో సుమారు 1,08,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో సీఎం కార్యాలయం ఉంది. అందులో 53 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కార్పెట్ ఏరియాకు వినియోగిస్తారని అధికారిక సమాచారం. మిగతా 1,32,000 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో సీఎం ఛాంబర్, మంత్రివర్గ సమావేశ మందిరం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆఫీసు, సీఎం సలహాదారులు, వ్యక్తిగత కార్యర్శుల ఆఫీసులు ఉంటాయి. దీంతోపాటు సీఎం కోసం వచ్చే వీవీఐపీలు కూర్చుకునేందుకు వెయిటింగ్ హాల్‌కు భారీస్థాయిలోనే స్థలం కేటాయించినట్టు అధికారులు అంటున్నారు. కాగా ప్రభుత్వంలోని అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలకంటే సీఎం ఆఫీసు పెద్దదనీ, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నదని చెబుతున్నారు.
దసరా పండుగ వచ్చేలోపు కొత్త సచివాలయం నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, ముందుగా సీఎంవోను అన్నింటి కంటే వేగంగా సకల సౌకర్యాలతో పూర్తిచేయాలని ఆర్అండ్బీ అధికారులు భావిస్తున్నారు. అందుకే సీఎం ఆఫీసు నిర్మాణంపై అధికారులు ఎక్కువగా శ్రద్ధపెడుతున్నారు. ఇక సచివాలయం లోపలికి సీఎం ప్రవేశించేందుకు ప్రధాన ద్వారాన్ని ఉపయోగిస్తారని అధికారిక సమాచారం. 25.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ కొత్త సచివాలయంలో భవనాలను రెక్టిలినియర్ ఆకారంలో నిర్మిస్తున్నప్పటికీ, అందులో కేవలం 97 శాతం స్థలం మాత్రమే భవన నిర్మాణాలకు వినియోగిస్తున్న విషయం తెలిసిందే.
33 జిల్లాల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక
రాష్ట్ర కొత్త సచివాలయ నిర్మాణం కళా ఆకృతుల ప్రతిబింబాలతో నిర్మించాలని సర్కారు ప్రణాళక. అంతేగాక 33 జిల్లాల సంస్కృతి , సాంప్రదాయాలకు ప్రతీకగా నిర్మాణం చేస్తున్నట్టు అధికారుల సమాచారం. ప్రతి జిల్లాలోని చారిత్రాత్మక కట్టడాలు, ప్రతిబింబించేలా నిర్మాణం చేపట్టాలని చర్యలు చేపడుతున్నారు. సచివాలయం మధ్యలో ల్యాండ్‌స్కేప్ ఆకారంలో పెద్దపౌంటేన్ ఉండనుంది. లోపలి ప్రాంతమంతా పచ్చటివాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకమైన చిన్న చిన్న మొక్కలు పెంచి గార్డెన్లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం వైశాల్యంలో 50 శాతం స్థలం గార్డెన్లతో నిండి ఉంటుంది. కొత్త సచివాలయం నిర్మాణంలో ఒకేసారి 650 కార్లు, 1500 బైక్‌లు పార్కింగ్ చేసేలా ప్రణాళికలు రూపొందించారు. దీంతోపాటు ప్రభుత్వ బ్యాంకులు, వాటి ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నారు. నూతన సచివాలయంలో ప్రతి నిర్మాణం, చివరికి వాష్‌రూంలు కూడా వాస్తు ప్రకారమే కడుతున్నట్టు అధికారులు అంటున్నారు.
ఐదుసార్లు తనిఖీ చేసిన సీఎం
కొత్త సచివాలయంతోపాటు సీఎం కార్యాలయ నిర్మాణం సీఎం కేసీఆర్ తన ఆలోచనలకు తగినట్టుగా సాగేందుకు ఇప్పటికే ఐదుసార్లు తనిఖీ చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపత్తిరెడ్డి సైతం తనిఖీలు చేస్తున్నారు. 2020 అక్టోబరు 28న టెండర్లు షాపూర్జీ పల్లోంజీ సంస్థ దక్కించుకోగా, జనవరి 26,2021 మొదటిసారి నిర్మాణ పనులను పరిశీలించారు. అదే ఏడాదిలో మార్చి 18న, ఆగస్ట్ ఏడున, డిసెంబరు తొమ్మిదిన నాలుగోసారి నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించారు. ఇప్పటివరకు 70 శాతం నిర్మాణాలు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. అందులో ఆరో అంతస్థులోని సీఎం కార్యాలయం నిర్మాణ పనులు మాత్రం ఏ ఒక్క రోజు కూడా నిలిపివేయకుండా మరింత వేగంగా చేస్తున్నట్టు ఉన్నతాధికారుల సమాచారం.
అక్టోబరు ఐదు నుంచి సీఎం విధుల్లోకి..?
సీఎం కేసీఆర్ కొత్త సచివాలయం పూర్తికాగానే అక్టోబరు ఐదున ప్రారంభించనున్నట్టు తెలిసింది. అదే రోజు అక్కడి నుంచే విధులు ప్రారంభిస్తారు. తొలుత రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండు నుంచి సచివాలయానికికి రావాలని భావించినా, కోవిడ్ మూలంగా పనులు పూర్తికాకపోవడంతో దసరా పండుగ రోజైనా అక్టోబరు ఐదు నుంచి సచివాలయానికి వచ్చి విధులు నిర్వర్తిస్తారని సమాచారం.దసరా తర్వాత నగరంలోని ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ రాష్ట్రస్థాయి కార్యాలయాలు, ఇతర ఆఫీసులు కొత్త సచివాలయంలోకి తరలించనున్నారు. జీ ప్లస్ ఆరు అంతస్థులతో నిర్మాణమవుతున్న సచివాలయం కోసం రూ. 610 కోట్లు కేటాయించి 12 నెలల్లోపు పూర్తిచేయాలని వర్కింగ్ ఏజెన్సీని సర్కారు ఆదేశించింది. జూన్ 19, 2019 సచివాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అదే నెల 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.