Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్నెళ్ల బడికి ఏడాది మొత్తం ఫీజు డిమాండ్
- ఎగ్జామ్ రాయనియ్యబోమంటూ వేధింపులు
- అడిగినంత కడితేనే వార్షిక పరీక్షలు
- విద్యార్థులపై పెరిగిన మానసిక ఒత్తిడి
నవతెలంగాణ - కరీంనగర్ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌కు చెందిన భార్గవ్ 9వ తరగతి చదువుతున్నాడు. విద్యాసంవత్సరానికి ఫీజు రూ.36వేలు ఉండగా రూ.15వేలు గతేడాది నవంబర్‌లో కట్టారు. ప్రస్తుతం రూ.21వేలు పెండింగ్‌లో ఉందని, ఈ ఫీజు చెల్లిస్తేనే పరీక్షలు రాయనిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్థిక పరిస్థితి బాగోలేక, చేసేది ఏమీ లేక అక్కడా ఇక్కడా అప్పుల్జేసి ఆ విద్యార్థి తండ్రి రూ.10వేలు చెల్లించాడు. అయినప్పటికీ మిగతా ఫీజు చెల్లిస్తేనే ఎగ్జామ్ రాయనిచ్చేదంటూ తెగేసి చెప్పారు. మొదటి రోజు పరీక్ష రాయనియ్యకుండా విద్యార్థిని మానసికంగా వేధించి చివరి నిమిషంలో అనుమతిచ్చారు. మర్నాడు ఎగ్జామ్ సమయానికి మిగతా ఫీజు చెల్లిస్తేగానీ పరీక్షకు అనుమతించలేదు.
ఇది ఒక భార్గవ్ పరిస్థితియే కాదు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రయివేటు కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరిదీ. మధ్యతరగతి కుటుంబాలు, మొన్నటి కరోనా సమయంలో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారి, కరోనాతో వ్యాపారాలు దెబ్బతిన్న కుటుంబాలకు పాఠశాల ఫీజు గుదిబండలా తయారైంది. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని, ఫీజులు పెంచొద్దని ప్రభుత్వం చెబుతున్నా.. అవి కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కనీసంగా చిన్నా, పెద్దా పాఠశాలలు 800 వరకు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 2లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఒకవైపు పరీక్షలు.. మరోవైపు ఫీజుల వేధింపులు
పాఠశాలల్లో 3 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈనెల 16 నుంచే పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో అయితే.. ఫీజులు మొత్తం వసూలు అవుతాయన్న ఉద్దేశంతో కొన్ని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రుల ముక్కుపిండి వసూలుకు తెగబడుతున్నాయి. ఇది ప్రతియేటా జరిగే తంతే అయినప్పటికీ కరోనా కారణంగా సగం రోజులే బడి నడిచినా.. ఏడాది మొత్తం ఫీజు డిమాండ్ చేయడం గమనార్హం. ఫీజులు చెల్లించకపోతే పరీక్షలు రాయించబోమంటూ పరోక్షంగా బెదిరింపులకు దిగుతున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురవుతున్నారు.
ఇదిలా ఉంటే.. గతేడాది కరోనా కారణంగా విద్యాసంవత్సరం సెప్టెంబర్ నుంచి ప్రారంభమైంది. అంతకుముందు కరోనా కారణంగా పాఠశాలలూ తెరవలేదు. అయినా అనేక పాఠశాలల్లో జూన్ నుంచి ఫీజులు చెల్లించాలని, ఇదేంటని అడిగితే ఆన్లైన్ తరగతులను సాకు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఫీజు చెల్లించకపోతే పరీక్షలు రాయించకపోవడం, తరగతి బయట నిలబెట్టడం, తోటి విద్యార్థుల ఎదుట అవహేళనగా మాట్లాడటం వంటివి విద్యార్థులకు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయివేటు పాఠశాలల్లో ఇష్టానుసారంగా ఫీజుల వసూళ్లపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తే స్పందించడం లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. గతేడాది కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏంటని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఫీజుల వసూళ్లపై కట్టడి చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. పరీక్ష పేరుతో విద్యార్థులను మానసిక ఒత్తిళ్లకు గురిచేయడం దారుణం. ఏడాది సగం రోజులు కూడా పాఠశాలలు తెరవకున్నా.. మొత్తం ఫీజులు అడగటంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- రజనీకాంత్- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి