Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం
- పెండింగ్‌లో రూ.1,350 కోట్ల బీఆర్జీఎఫ్ నిధులు : ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆవేదన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణకు హక్కుగా రావాల్సిన రూ.7,183 కోట్లను కేంద్రం తొక్కిపట్టిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల (బీఆర్జీఎఫ్) కింద చెల్లించాల్సిన రూ.1,350 కోట్లను కూడా పెండింగ్‌లో ఉంచారని చెప్పారు. ఇలాంటి అంశాలపై మంత్రి కేటీఆర్ వాస్తవాలను చెబితే... కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మింగుడు పడటం లేదని ఎద్దేవా చేశారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలని డిమాండ్ చేశారు.
శనివారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో పీయూసీ చైర్మెన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను లెక్కలతో సహా ఆయన ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణకు ఇప్పటి వరకూ రూ.3 లక్షల కోట్లు ఇచ్చామంటూ కేంద్ర మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మోడీ సర్కార్ సెస్‌ల రూపంలో రాష్ట్రాల ఆదాయానికి భారీ స్థాయిలో గండి కొడుతున్నదని చెప్పారు. పన్నుల్లో 41 శాతం వాటా రావాల్సి ఉన్నా... సెస్ పుణ్యమానీ అది 25 శాతానికి పడిపోయిందని తెలిపారు. ఈ రూపంలో రాష్ట్రాల ఆదాయాన్ని మొత్తం 11 శాతం మేర కేంద్రం కొల్లగొడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం.. రాష్ట్రాలకు నిధులను విడుదల చేయాలంటూ చెప్పినా మోడీ సర్కారు పెడచెవిన పెట్టిందన్నారు. పెట్రోల్‌పై రూ.27, డీజిల్‌పై రూ.21ను సెస్ రూపంలో కేంద్రం వసూలు చేస్తుండటంతో వాటి రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రూపంలో గతేడాది ప్రజల నుంచి రూ.నాలుగు లక్షల కోట్ల ఆదాయాన్ని కేంద్రం దోచుకున్నదని వివరించారు. గ్యాస్ సిలిండర్ ధరను రూ.400 నుంచి వెయ్యికి పెంచిన ఘనత బీజేపీదేనని అన్నారు. ఇదే సమయంలో ఒక్కో సిలిండర్‌కు ఇచ్చే సబ్సిడీని రూ.40కి తగ్గించారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలంటూ ఊదరగొట్టిన మోడీ... దేశం మొత్తం మీద ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయటం లేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలను మాట్లాడాలంటూ హరీశ్ హితవు పలికారు.