Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో 111 పరిధిలో వేల ఎకరాలు లీడర్లవే
- రైతుల భూములు 10 శాతమే
- జీవో ఎత్తివేతతో వ్యవసాయ భూములు కనుమరుగు
- కూలీలుగా మారనున్న ఆ ప్రాంత ప్రజలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయప్రతినిధి
''మా పేరు చెప్పుకుని బడాబాబులు వారి భూములు కాపాడుకోవడానికి భూముల ధరలు పెంచుకోవడానికి ఆడిన నాటకమే జీవో 111 ఎత్తివేత. దాంతో తమకు ఒరిగేది ఏమీ లేదు. జీవో పరిధిలో ఉన్న లక్షల ఎకరాల్లో 90 శాతం భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. రాజకీయంగా వారిని కాపాడుకోవడానికి సర్కారు జీవో ఎత్తివేత నాటకానికి తెరమీదికి తెచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ భూములు కూడా రియల్ భూములుగా మారనున్నాయి. భవిష్యత్‌లో వ్యవసాయ పనులు కూడా దొరికే పరిస్థితి లేదు. తమ భూముల వద్ద తామే కూలీలుగా మారే స్థితికి ప్రభుత్వం వడిగట్టిందని రైతులు వాపోతున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని 84 గ్రామాల పరిధిలో జీవో 111 ఆంక్షలు 26 ఏండ్లుగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో మొత్తం సుమారు 1.34 లక్షల ఎకరాల భూములున్నాయి. ఈ భూములను వ్యవసాయానికి తప్ప మరో రకంగా వాడుకోవడానికి వీలు లేదు. ఈ ప్రాంతంలో పారిశ్రామిక ఇండిస్టీయల్, భవనాల నిర్మాణాలపై అంక్షలున్నాయి. దాంతో జీవో ఎత్తివేత కోసం ఎన్నో ఏండ్లుగా రాజకీయ నాయకులు ప్రభుత్వాలతో మంతనాలు జరుపుతున్నారు. అసలు జీవో తీసుకురావడానికి ప్రధాన కారణం.. జిల్లాల్లో ఉన్న రెండు జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ నదుల పరిరక్షణ కోసం 1986లో నాటి ప్రభుత్వం జీవో 111 తీసుకురావడం జరిగింది. నదుల పరిరక్షణలో భాగంగా రెండు జలాశయాలకు ఎటువైపైనా 10 కి.మీ మేరకు ఎలాంటి నిర్మాణాలు, కలుషిత వాతావరణాన్ని కలిగించే కంపెనీల నిర్మాణాలకు అవకాశం లేదని జీవోలో పొందుపర్చారు. ఈ నదుల నుంచి హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం గోదావరి నీళ్లు హైదరాబాద్ నగరానికి అందించేందుకు ప్రత్యేక ప్రాజెక్టు నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నదులతో హైదరాబాద్ ప్రజలకు ఏమీ సంబంధం లేదని ప్రభుత్వం ప్రచారం చేస్తూ.. తమ రాజకీయ లబ్దికోసం ఎన్నో ఏండ్లుగా నదులను పరిరక్షిస్తున్న జీవో ఎత్తివేస్తూ ఇటీవల జీవో 69 తీసుకువచ్చింది. జీవో ఎత్తివేసిన ఉద్దేశం ఒకటైతే.. ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు ప్రచారం చేస్తుంది మాత్రం మరొకటి. పేద రైతుల ప్రయోజనాల కోసమేనంటూ చెబుతున్నారు. దీన్ని క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. జీవో ఎత్తివేతతో తమకు ఎలాంటి ప్రయోజనం లేదనీ, లాభపడేదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రియల్ రంగాల్లో ఉన్న రాజకీయ నాయకులు మాత్రమేనని ఆయా ప్రాంతాల్లోని స్థానికులు వాపోతున్నారు.
ఫామ్ హౌస్‌ల పరిరక్షణ కోసమే..
జీవో 111 పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదని ఆంక్షలు ఉన్నప్పటికీ.. రాజకీయ అండదండలున్న రియల్ వ్యాపారులు, రాజకీయ నేతలు హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల ప్రాంతాల్లో ఫామ్‌హౌస్‌లు, విశాలమైన విల్లాలు నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఒక విల్లా ధర రూ.30 కోట్లు పలుకుతుంది. జీవో ఎత్తివేతతో వీటి ధర మూడింతలు పెరగనుంది. విల్లాలతో పాటు అధికార పార్టీ ముఖ్య నాయకుల ఫామ్‌హౌస్‌లు కూడా ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. జీవో 111 అమలులో ఉన్నప్పటికీ.. ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారులు. రాజకీయ నేతలు రైతుల వద్ద వేల ఎకరాలు తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారు. దాంతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో స్థానిక ప్రజల కంటే వివిధ ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే వారంతా జీవో ఎత్తివేతకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించారు. భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో పేద ప్రజలు, రైతులకు నయా పైసా ప్రయోజనం లేదని స్థానికులు ఘంటాపదంగా చెబుతున్నారు.
రియల్ వ్యాపారుల కోసమే జీవో ఎత్తివేత - దయాకర్, మోయినాబాద్
జీవో 111 పరిధిలో ఉన్న భూముల్లో రైతు కుటుంబాలకు ఉన్న భూములు 10 శాతం మాత్రమే. ప్రభుత్వం మాత్రం రైతు ప్రయోజనాలు కోరి జీవో ఎత్తివేయడానికి నిర్ణయించామని మా పేరు వాడుకుంటుంది తప్ప.. తమకు పైసా లాభం లేదు. పైగా దీనివల్ల రైతు వద్ద తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసిన బడా పెట్టుబడిదారులకు లాభం చేకురనుంది. జీవో ఎత్తివేతతో ఉన్న వ్యవసాయ భూములు కాస్తా రియల్ భూములుగా మారి కనీసం కూలీ పనులు కూడా దొరికే పరిస్థితి లేకుండా పోనుంది. ప్రభుత్వం జీవో ఎత్తివేతపై కఠినమెన ఆంక్షలు విధించి వ్యవసాయ భూములు కాపాడాలి.