Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంటింట్లో కత్తి, వృత్తిలో కలంతో రాణిస్తున్న మహిళా జర్నలిస్టులు
- పని ప్రదేశాల్లో ఎన్నో సమస్యలు
- అమలుకు నోచుకోని రక్షణ చట్టాలు
- సమస్యలు పరిష్కరించేందుకు కృషి
- మహిళా జర్నలిస్టుల వర్క్‌షాపులో మంత్రులు సబితా,సత్యవతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అన్ని రంగాల్లో వివక్ష ఉన్నట్టే.. జర్నలిజంలోనూ ఉందని రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌తోపాటు పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివక్షను, ఒడిదుడుకులను అధిగమించి మహిళా జర్నలిస్టులు తమ వృత్తిలో రాణించాలని మంత్రులు సూచించారు. అందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తరపున చేపడతామని హామీ ఇచ్చారు. అవసమైతే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చించి మహిళా పాత్రికేయులకు అన్ని రకాలుగా న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని భరోసానిచ్చారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు కొనసాగే మహిళా పాత్రికేయుల వర్క్‌షాపు శనివారం హైదరాబాద్‌లోని టూరిజంప్లాజాలో ప్రారంభమైంది. ప్రముఖ మహిళా జర్నలిస్టు సుమబాల అధ్యక్షత వహించగా, స్వేచ్ఛ సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ మహిళా జర్నలిస్టులు ఆయా సంస్థల్లో తాము ఎదుర్కుంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా పని ప్రదేశాల్లో మహిళలకు అవసరమైన సౌకర్యాలు లేవని చెప్పారు. వారికి ప్రత్యేకంగా ఇవ్వాల్సిన సెలవులు ఇవ్వాలంటే కూడా సవాలక్ష ప్రశ్నలు వేస్తారని వివరించారు. మహిళా జర్నలిస్టులకు ప్రమోషన్లతో పాటు అనేక విషయాల్లో వివక్ష కొనసాగుతున్నదని చెప్పారు. రాత్రి వేళల్లో పనిచేయలేరనే సాకుతో తమ ప్రతిభను తొక్కేస్తున్నారని మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఏదైనా పనిచేస్తున్నప్పుడు..అందులో ఏం తప్పుదొరుకుతుందా? అని నిరంతరం ఎదురుచూసి, చివరకు ఏ కాస్త తప్పుదొర్లినా..మహిళలు కాబట్టే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయంటూ రంద్రాన్వేషణ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. చూసే చూపుల్లో..మాట్లాడే మాటల్లో ద్వందార్థాలు గోచరించే విధంగా మాట్లాడుతారనీ, ఇది మహిళలపట్ల వివక్షకాక, మరేమవుతుందని ప్రశ్నించారు. నవతెలంగాణతో పాటు మరో సంస్థ మినహాయిస్తే మరే ఇతర మీడియా సంస్థల్లోనూ లైంగిక వేదింపుల నిరోధక కమిటీలు లేవని చెప్పారు. తక్షణం వాటిని వేయాలని కోరారు. అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ముఖ్యవక్తగా పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సమాజంలో మహిళలంటే సహజంగానే చిన్న చూపు ఉన్నదని చెప్పారు. గరిటెలు తిప్పేటోల్లు బయటికొచ్చి ఏం చేస్తారని ఎద్దేవా చేసినోళ్లను చూశానని గుర్తుచేశారు. అలాంటి అభిప్రాయాలను తిరగరాసి అనేక మంది మహిళా జర్నలిస్టులు సక్సెస్ స్టోరీలందించాలన్నారు. సూటిపోటి మాటల్ని ఛాలెంజ్‌గా తీసుకుని ఎంచుకున్న రంగంలో పట్టుదలతో పనిచేయాలని ఉద్భోదించారు. మహిళా జర్నలిస్టులు కోరిన విధంగా మీడియా సెంటర్‌కోసం కృషి చేస్తామనీ, మిగతా విషయాలను కూడా సీఎంతో చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు. జర్నలిస్టుల పిల్లలకు రాయితీతో కూడిన విద్య అంశాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామినిచ్చారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ జర్నలిజంలో రోజురోజకీ కొత్త, కొత్త విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం వస్తోందన్నారు. ఫలితంగా తీవ్ర పోటీ నెలకొందని చెప్పారు. ఈ పోటీ జర్నలిజంలో నిలదొక్కుకోవడం నిజంగా మహిళలకు ఛాలెంజేనన్నారు. ఒక డాక్టర్ తప్పు చేస్తే రోగికి మాత్రమే నష్టం, కానీ జర్నలిస్టు తప్పు చేస్తే సమాజం మొత్తం నష్ట పోతుందని గుర్తుచేశారు. మహిళా జర్నలిస్టులకు వృత్తిపరంగా అనేక ఇబ్బందులుంటాయనీ, వ్యంగ్యపు మాటలూ వింటుంటామనీ, అయినా.. వీటన్నింటిని తట్టుకుని నిలబడుతున్నందుకు అభినందనలని చెప్పారు. పురుషులకు మహిళలు అంటే చిన్న చూపు ఉండొచ్చు. కానీ పురుషులు అంటే మహిళలకు చిన్న చూపు ఉండదని చెప్పారు. అలా ఉంటే సృష్టే ఉండబోదన్నారు. కత్తి, కలం రెండింటిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి మహిళా జర్నలిస్టులదని చెప్పారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య రక్షణలో జర్నలిజం నాలుగో స్తంభమన్నారు. పురుషులకే సొంతం అనే ముద్ర ఉన్న ఈ రంగంలో మహిళలు ఇంతమంది ఉండటం సంతోషమని చెప్పారు. వృత్తిపరంగా పని చేసే చోట వేధింపులను అరికట్టే విధంగా మీడియాలో కమిటీలు వేయాలని మీడియా అకాడమీని ఆదేశించారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మీడియా అకాడమి చైర్మెన్ అల్లం నారాయణ తదితరులు మాట్లాడారు.
సారీ చెప్పిన అల్లం..
ప్రెస్ క్లబ్లో మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేక వసతులు కావాలని జర్నలిస్టు వనజ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని మీడియా అకాడమీ చైర్మెన్‌కు కూడా గతంలోనే చెప్పామన్నారు. ఆయన సూచించిన మేరకే ఇక్కడ ప్రస్తావిస్తున్నానన్నారు. స్పష్టంగా ఈ ప్రతిపాదన పెట్టకుండా మహిళలకు మీడియా సెంటరంటూ తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పారు. దీనిపై మంత్రులు స్పందిస్తూ ఖర్చు ఎంతవుతుందని అడిగారు..సుమారు రూ.30,35లక్షలు అవుతుందని చెప్పటంతో తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అకాడమీ చైర్మెన్ చైర్మెన్ అల్లం నారాయణ కలుగజేసుకుని ..ఇక్కడ మాట్లాడాల్సిన విషయాలు కాదనీ, ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నారని కోపంగా అడ్డుకోవటంతో వనజ స్టేజీదిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత అల్లం నార్యాణ సారీచెప్పి స్టేజీ మీదకు ఆహ్వానించారు. అప్పటికే ఆ జర్నలిస్టు అక్కడి నుంచి వెళ్లిపోయారు.