Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాస్పత్రుల్లో శస్త్రచికిత్సలు పెంచేందుకు యత్నం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'డాక్టర్లున్నారు. సౌకర్యాలున్నాయి. అయినప్పటికీ ప్రయివేటుతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో కొన్ని విభాగాల్లో శస్త్రచికిత్సలు తక్కువగా జరుగుతున్నాయి. అదే సమయంలో అంత కన్నా తక్కువ మంది డాక్టర్లు, సిబ్బంది, సౌకర్యాలున్న ప్రయివేటు ఆస్పత్రుల్లో రోజువారీగా జరుగుతున్న శస్త్రచికిత్సలెక్కువ. ఈ పరిస్థితికి కారణమేంటి?. శస్త్రచికిత్సలు తక్కువగా జరగడానికి కారణమేంటి?' ఇదీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆయా విభాగాల డాక్టర్లను అడిగిన ప్రశ్న. ప్రభుత్వ దవాఖానాలకు రోగులు తక్కువగా వస్తున్నారన్నది వారి సమాధానం. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరులు, పరికరాలు, సౌకర్యాలు పూర్తి స్థాయిలో వినియోగం కావడం లేదని అర్థమవుతున్నది. దీన్ని సరిచేసి రోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వాస్పత్రులను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాలిచిప్పల మార్పిడి శస్త్రచికిత్సలకు సంబంధించి అవసరమైన రోగులను గుర్తించేందుకు నిర్ణయించారు.
ప్రయోగాత్మకంగా సిద్ధిపేట జిల్లాలో ఇటీవల 60 ఏండ్లపై బడి కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి కోసం ఆరోగ్యశిబిరం నిర్వహించారు. 450 మందికి పైగా బాధితులు శిబిరానికి రాగా వారికి ప్రాథమిక పరీక్షలు చేసి 50 మందికి పైగా మోకాలిచిప్ప మార్పిడి శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. ప్రయోగాత్మకంగా నిర్వహించిన శిబిరం విజయవంతం కావడంతో ఇలాంటి శిబిరాలను ఇతర జిల్లాల్లో నిర్వహించాలని మంత్రి హరీశ్ గాంధీ ఆస్పత్రి డాక్టర్లను ఆదేశించారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇదే శస్త్రచికిత్సకు రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు వసూలు చేస్తుండగా, ఆర్థికంగా కూడా పేద, మధ్యతరగతి రోగులకు ఇబ్బందిగా మారింది. ప్రయివేటు దోపిడీ నుంచి పేద రోగులను కాపాడటంతో పాటు ప్రభుత్వాస్పత్రి సిబ్బందికి పని కల్పించేందుకు ఆరోగ్యశిబిరాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. హైదరాబాద్లోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ప్రతి రోజు 20 వరకు శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. దీన్ని నివారించేందుకు ఇక నుంచి ఆయా జిల్లాల్లో ప్రభుత్వాస్పత్రుల డాక్టర్ల ద్వారా ఆరోగ్యశిబిరాలను నిర్వహించనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఒక ఉన్నతాధికారి తెలిపారు.