Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత అవసరం
- టీఎస్పీఎస్సీ పాలకమండలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులందరూ ఎదురుచూస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలకు మరికొంత సమయం పట్టే అవకాశమున్నది. వారం రోజుల్లో నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సమాలోచన చేస్తున్నట్టు తెలిసింది. శనివారం టీఎస్పీఎస్సీ పాలకమండలి సమావేశం జరిగింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌కు సంబంధించిన చర్చ జరుగుతుండడంతో అభ్యర్థుల్లో ఎంతో ఆసక్తి నెలకొన్నది. ప్రిలిమ్స్, మెయిన్స్ రాతపరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి, దరఖాస్తుల సమర్పణకు గడువు ఎంత ఇవ్వాలి, ఫీజు ఎంత నిర్ణయించాలనే అంశాలపై చర్చించినట్టు సమాచారం. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో 12 శాఖల నుంచి 19 రకాల పోస్టులు భర్తీ కానున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉన్నది. అవి వచ్చిన వెంటనే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా, అభ్యర్థులకు ఇబ్బందులు రాకుండా చూసుకుని గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు ఇంటర్వ్యూలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈనెల 12న అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. రాతపరీక్ష ఆధారంగానే ఆయా పోస్టులకు అభ్యర్థులను పారదర్శకంగా ఎంపిక చేయాలని నిర్ణయించింది.