Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ఘటనలో కూల్‌డ్రింక్ ఆశ చూపి దాడికి యత్నం
నవతెలంగాణ-కంఠేశ్వర్/జక్రాన్‌పల్లి
అభం శుభం తెలియని బాలికలపై లైంగికదాడి ఘటనలు నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపాయి. జిల్లా కేంద్రంతో పాటు జక్రాన్‌పల్లి మండలంలో ఈ విషాద ఘటనలు శుక్రవారం చోటుచేసుకోగా.. శనివారం వెలుగులోకి వచ్చాయి.
వివరాల్లోకి వెళ్తే..
జిల్లా కేంద్రంలోని నాలుగోటౌన్ పరిధిలో ఓ బాలికపై సమీపంలో నివాసముండే శ్రావణ్ అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో నిందితుడిని నిలదీశారు. దాంతో వాగ్వాదం చోటుచేసుకోవడంతో బాధితకుటుంబ సభ్యులు నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శ్రావణ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడ్ని ఆదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించామని ఎస్ఐ సందీప్ తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కాలనీవాసులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కొంతమంది కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు.
కూల్‌డ్రింక్ ఆశ చూపి..
ఎనిమిదేండ్ల చిన్నారికి కూల్‌డ్రింక్ ఆశ చూపి లైంగికదాడికి యత్నించాడు. ఈ ఘటన జక్రాన్‌పల్లి మండలంలోని ఓ గ్రామంలో వెలుగుజూసింది. స్థానికంగా నివసించే వ్యక్తి(35) చిన్నారికి కూల్‌డ్రింక్ కొనిస్తా అని ఆశ చూపి పక్కనే ఉన్న గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లాడు. స్థానికులు గమనించి అడ్డుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం.