Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనిషిని మనిషిగా ప్రేమించే సమాజంకావాలి
- జూలూరు గౌరీశంకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మనిషిని మనిషి ప్రేమించే సమాజాన్ని నిర్మించేందుకు తెలంగాణ కవులు, రచయితలు ఎప్పుడూ ముందుంటారనీ, సమాజానికి అదే రక్షణగా నిలుస్తుందని తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మెన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. తెలంగాణ భాష మండలి, ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ''తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం'' అనే అంశంపై జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. మనుషులను మతం పేరున విభజించే విధ్వంసకర భావజాలానికి వ్యతిరేకంగా ప్రగతిశీల సాహిత్యాన్ని సృష్టించాలన్నారు. గంగాజమునా తెహజీబ్ సంస్కృతిని నిలబెట్టిన మహోన్నత తెలంగాణ మానవీయ మట్టి చరిత్రకు వారసులుగా ఈతరం కవులు కదలాలని పిలుపు నిచ్చారు. ప్రస్తుత తరుణంలో విచ్ఛిన్నకర మతోన్మాదాన్ని తిప్పికొట్టే సాహిత్యం ప్రవాహావేగంతో రావాల్సిన ఉందన్నారు. సదస్సుకు వచ్చిన ప్రసిద్ద కవులు, కళాకారులు, అధ్యాపకబృందానికి డాక్టర్ గంట జలందర్‌రెడ్డి స్వాగతం పలుకుతూ సాహిత్య విశిష్టతను విశ్లేషించి చేప్పారు. సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ కవి డాక్టర్ టి చమన్ తెలంగాణ భాషా సాహిత్య రంగాల కృషిని వివరించారు. విశిష్ట అతిధిగా వచ్చిన సామిడి జగన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాహిత్య మూలాలని ప్రాచీన సాహిత్యం నుంచి అధునిక సాహిత్యం వరకు వివరిస్తూ పరిశోధణాత్మకమైన ప్రసంగం చేశారు. ప్రముఖ ఆర్టిస్టు ఎం.వీ రమణారెడ్డి కళా రంగాల గురించి మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.రాజేంద్రప్రసాద్, కళాశాల అధ్యాపకురాలు నిదాన కవి నీరజ, రమణానంద తీర్థ గ్రామీణ అభివృద్ది శిక్షణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎన్ కిశోర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయలక్ష్మీ, ఎం వాణి, బండారి ప్రేమ్‌కుమార్, టి కాంతా రావు, ఎం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.