Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో అందుకున్న అధికారులు
- అభినందనలు తెలిపిన మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మలేరియా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు లభించింది. సోమవారం వరల్డ్ మలేరియా డేను పురస్కరించుకొని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మనుసుక్ మాండవీయ చేతుల మీదుగా తెలంగాణ మలేరియా విభాగం అధికారులు ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రానికి అవార్డు రావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కషి చేసిన వైద్యారోగ్య, పంచాయతీ, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ''మలేరియాను నియంత్రించి, కేసులను గణనీయంగా తగ్గించి కేటగిరీ-2 నుంచి కేటగిరీ-1కు రాష్ట్రాన్ని చేర్చడంలో మీ అందరి కృషితో పాటు ప్రజల సహకారం ఉంది.'' అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దోమలను నివారించి, ప్రజలను వ్యాధుల బారి నుంచి రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఏటా వర్షాకాలం ప్రారంభంలో గ్రామాలు, పట్టణాల్లో అన్ని రకాల వ్యర్థాలను, కుప్పలను తొలగించడం, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను కూల్చి వేయడం, డ్రై డే వంటి కార్యక్రమాలు ఫలితంగా దోమల సంఖ్య పెరగకుండా నియంత్రించగలిగామనీ, తద్వారా మలేరియా కేసులు రాష్ట్రంలో తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు.